కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్‌లో వైరల్‌గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్‌కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
గత ఏడాది డిసెంబర్‌లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.
దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంగా యూరప్‌లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.
వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది.


