Japan People Opposing Shinzo Abe State Funeral, Man Sets Himself On Fire - Sakshi
Sakshi News home page

Shinzo Abe Funerals: మా సొమ్ముతో షింజో అబేకు అంత్యక్రియలొద్దు.. జపాన్‌లో వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత

Published Wed, Sep 21 2022 10:39 AM

Japan People Oppose Shinzo Abe State Funeral - Sakshi

టోక్యో: ప్రభుత్వ లాంఛనాలతో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు అంత్యక్రియలు నిర్వహించాలన్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జపాన్‌ సగం జనాభా అందుకు వ్యతిరేకంగా ఉండడమే ప్రధాన కారణం. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 

అవును.. జపాన్‌కు సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా చేసిన షింజో అబేకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజావ్యతిరేకత ఎదురవుతోంది. జులై 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై.. ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

మత సంబంధిత వ్యవహారంతోనే షింజో అబే హత్య జరగడం, పైగా తన జీవితంలో పడ్డ కష్టలకు ప్రతిగానే సదరు వ్యక్తి కాల్పులు జరపడంతో.. నిందితుడిపైనే అక్కడి ప్రజల్లో సానుభూతి మొదలైంది. అయితే జపాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన సందర్భాలు చాలా అరుదు. పైగా అబే హత్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అబేకు ప్రభుత్వ లాంఛనాలతో, అదీ ప్రజా ధనంతో అంత్యక్రియలు నిర్వహించకూడదంటూ వివిధ సర్వే పోల్స్‌లో జపాన్‌లోని సగానికి పైగా జనాభా అభిప్రాయం వ్యక్తం చేసింది. 

తాజాగా.. అబేకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను వ్యతిరేకిస్తూ ప్రధాని ఫుమియో కిషిదా కార్యాలయం వద్ద బుధవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునే యత్నం చేసిన ఓ పోలీసాధికారికి సైతం గాయాలయ్యాయి. అయితే బాధితుడి పరిస్థితిపై వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇక ప్రభుత్వమేమో విమర్శలను, అభ్యంతరాలను లెక్కచేయకుండా సెప్టెంబర్‌ 27వ తేదీన అంత్యక్రియలు నిర్వహించాలని అనుకుంటోంది.

ఇదీ చదవండి: షాకింగ్‌ ఘటన.. సగం గుండెతో పుట్టిన బిడ్డ

Advertisement
Advertisement