ట్రంప్‌, నెతన్యాహు కీలక భేటీ.. యుద్ధానికి ఎండ్ కార్డ్? | Israeli PM Netanyahu May Visit The White House As Early As Next Week, Likely To Focus On Iran And Gaza | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, నెతన్యాహు కీలక భేటీ.. యుద్ధానికి ఎండ్ కార్డ్?

Jul 5 2026 7:42 AM | Updated on Jul 5 2026 10:33 AM

 Israeli PM Netanyahu may visit the White House as early as next week

వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న శాంతి చర్చలకు, లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఆటంకంగా మారడంతో.. గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ట్రంప్‌తో నెతన్యాహు భేటీ కానున్నారు. 

ఇరువురి భేటీ గురించి ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనపై ట్రంప్ స్పందిస్తూ..‘మా ఇద్దరి మధ్య సెంటిమెంట్లు చాలా బాగున్నాయి. అసలు బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసు’ అని ఆక్సియోస్ ఫోన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

జూలై 7-8 తేదీలలో టర్కీలో జరిగే నాటో సదస్సుకు ట్రంప్ హాజరుకానుండటంతో, వచ్చే వారమే ఈ పర్యటన సాధ్యం కాకపోవచ్చని, బహుశా ఆ పైవారంలో భేటీ జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. త్వరలోనే అమెరికాలో కలవాలని ఇరు నేతలు ఫోన్‌లో నిర్ణయించుకున్నట్లు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించింది.

మరోవైపు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా ఇరాన్ మధ్య, సరిహద్దు ఒప్పందాన్ని తిరస్కరిస్తూ హెజ్‌బొల్లా సాగిస్తున్న డ్రోన్ దాడులతో లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 1,000 రోజులుగా సాగుతున్న యుద్ధంతో గాజా ప్రాంతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ సంక్షోభాలన్నింటికీ ముగింపు పలికే దిశగా ట్రంప్, నెతన్యాహు చర్చలు కీలక అడుగు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement