నౌకలపై ఇరాన్‌ దాడి | IRGC attacked three ships in the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

నౌకలపై ఇరాన్‌ దాడి

Apr 23 2026 5:05 AM | Updated on Apr 23 2026 6:21 AM

IRGC attacked three ships in the Strait of Hormuz

మూడింటిపై దాడిచేసి రెండింటిని స్వాదీనం చేసుకున్న ఐఆర్‌జీసీ

కాల్పుల విరమణ గడువును పొడిగించిన డొనాల్డ్‌ ట్రంప్‌

హార్మూజ్‌ దిగ్బంధనం కొనసాగుతుందన్న అమెరికా అధ్యక్షుడు 

ఈ ప్రకటన వెలువడ్డ కొన్ని గంటలకే నౌకల ఆక్రమణకు తెరలేపిన ఇరాన్‌ 

భారత్‌కు రావాల్సిన నౌక పైనా ఇరాన్‌ కాల్పులు 

కాల్పుల విరమణ గడువు పొడిగింపుపై పాక్‌ హర్షం 

వాయిదాపడిన రెండో దఫా చర్చలు

వాషింగ్టన్‌/టెహ్రాన్‌/ఇస్లామాబాద్‌/దుబాయ్‌: పాక్‌ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్‌ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. 

ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్‌ చేసిన ప్రకటనతో పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్‌ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్‌జీసీ నేవీ గన్‌బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్‌ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. 

మరోవైపు ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్‌కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్‌ చెప్పినట్లు ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్‌ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్‌ హర్షం వ్యక్తంచేసింది. 

సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్‌ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్‌ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. 

ఇరాన్‌ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్‌ దిగ్బంధం, ఇరాన్‌ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్‌ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్‌ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్‌ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. 

ముంద్రా పోర్ట్‌కు వస్తుంటే మెరుపుదాడి
ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్‌ మైళ్లదూరంలో హార్మూజ్‌ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్‌ నౌక ‘ఎపామినోండాస్‌’పైకి ఐఆర్‌జీసీ నేవీ గన్‌బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్‌ ట్రాఫిక్‌’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్‌ బలగాలు కాల్పులు జరిపాయి. 

ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్‌ తీరానికి కేవలం 8 నాటికల్‌ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్‌గార్డ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్‌ తీరానికి కేవలం ఆరు నాటికల్‌ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్‌సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది.

 ఎపామినోండాస్, ఎంఎస్‌సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్‌తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్‌ను దాటుతున్నాయని ఇరాన్‌ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్‌ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్‌సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్‌»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్‌డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.

గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్‌ 
గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్‌ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్‌గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేల్‌ చెప్పారు.

క్షిపణుల ప్రదర్శన 
మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్‌ జంకుతున్నాయంటూ ఇరాన్‌ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్‌ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్‌ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్‌ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్‌ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.

సముద్ర ఇంటర్నెట్‌ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్‌
గల్ఫ్‌ దేశాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్‌ వార్తాసంస్థ టాస్నిమ్‌ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. 

దీంతో పర్షియన్‌ గల్ఫ్‌ దేశాల్లో ఇంటర్నెట్‌ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్‌ అరబ్‌ దేశాల ఇంటర్నెట్‌ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్‌ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్‌ గుండా పలుదేశాల ఇంటర్నెట్‌ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్‌ దన్నుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.

ఎలాంటి చెల్లింపులు జరపలేదు
నగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్‌ 
న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్‌ జలసంధిని దాటేలా ఇరాన్‌కు భారత్‌ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్‌ స్పష్టంచేసింది. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్‌ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్‌ తమ నౌకదేనని ‘సన్మార్‌ హెరాల్డ్‌’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్‌ బయటకురావడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్‌ వివరణ ఇచ్చింది. 

ఈ మేరకు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్‌ మాంగళ్‌ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను దాటేందుకు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) నేవీ అధికారులకు సన్మార్‌ హెరాల్డ్‌ నౌక కెప్టెన్‌ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్‌ స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 18వ తేదీన రెండు భారత్‌కు వచ్చే నౌకలపై ఆర్‌ఆర్‌జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్‌ హెరాల్డ్‌ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి.  

Advertisement
 
Advertisement
Advertisement