అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త మెలిక పెట్టింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే తమ ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పింది. వాషింగ్టన్ స్పందన తమకు సంతృప్తికరంగా లేదని, కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సేన్ రెజాయ్ ప్రకటించారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు మరోసారి సందిగ్ధంలో పడ్డాయి.
కాగా, అమెరికా నుంచి వచ్చిన ప్రతిపాదనలో కొన్ని షరతులను అంగీకరించినప్పటికీ, మరికొన్నింటిపై స్పష్టత లేదని రెజాయ్ వెల్లడించారు. తమ ఏడు షరతులు నెరవేరే వరకు అమెరికాకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని, చర్చలు కూడా ముందుకు సాగవని స్పష్టం చేశారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతున్నప్పటికీ, ప్రధానంగా ఏ అంశాన్ని ముందుగా అమలు చేయాలన్న దానిపై విభేదాలు ఉన్నట్లు సమాచారం.
అణు చర్చలకు ఇప్పట్లో నో!
మరోవైపు.. ప్రస్తుత చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేర్చడాన్ని టెహ్రాన్ వ్యతిరేకిస్తోంది. తమ తక్షణ ప్రాధాన్యం హార్ముజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడమేనని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. అణు కార్యక్రమంపై చర్చలకు బదులుగా ఆంక్షల సడలింపు పొందేందుకు ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలను కూడా ఆయన ఖండించారు.
అక్టోబర్ 4న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖెర్ ఖాలిబాఫ్ సైతం ఏడు షరతులు నెరవేరే వరకు అమెరికాకు జలసంధిని తెరిచేది లేదని ప్రకటించారు.
త్వరలోనే యుద్ధం ముగిస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని త్వరగానే ముగించగలమని వ్యాఖ్యానించారు. ఇరాన్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోందని పేర్కొంటూనే, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ అమెరికా దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని గతంలో స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు అనుమతించబోమని మరోసారి ప్రకటించారు.
ఇక, అమెరికా దౌత్య ప్రయత్నాలను పక్కనపెట్టి సైనిక చర్యలకు దిగితే తాము గతంలో కంటే మెరుగైన సన్నద్ధతతో ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. దేశ రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ క్షిపణుల పరిధిని పెంచనున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు కూడా ప్రకటించాయి.
సౌదీలో ఉద్రిక్తత..
ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలోని రియాద్ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. రియాద్‌పై దాడికి ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులే కారణం కాగా.. ఈ దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హౌతీలపై సౌదీ సైనిక చర్యల్లో అమెరికా కూడా పాల్గొనే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం దాడిని ఖండించారు.
దాడి నేపథ్యంలో రియాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు విమాన ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా.. హార్ముజ్ జలసంధి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, సౌదీపై దాడులు.. ఇలా పలు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడటంతో యుద్ధానికి ముగింపు పలికే దౌత్య ప్రయత్నాలు కఠినంగా మారుతున్నాయి.
ఇదీ చదవండి: పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ!


