ముగ్గురు ఇజ్రాయెల్‌ గూఢచారులను ఉరితీసిన ఇరాన్‌ | Iran executes three men accused of spying for Israel | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఇజ్రాయెల్‌ గూఢచారులను ఉరితీసిన ఇరాన్‌

Jun 26 2025 5:53 AM | Updated on Jun 26 2025 5:53 AM

Iran executes three men accused of spying for Israel

700 మంది అనుమానితుల అరెస్టు 

టెహ్రాన్‌: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఇరాన్‌.. ముగ్గురు ఇజ్రాయెల్‌ గూఢచారులను ఉరితీసింది. గూఢచర్యం అనుమానం, గూఢచారులకు ఆవాసం కల్పిస్తున్న ఆరోపణలతో 700 మందిని అరెస్టు చేసింది. 12 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయెల్‌ గూఢచార వ్యవస్థ మొస్సాద్‌కు సహకరించారని, ఒక వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని మొసాద్‌కు అందించారని ఇరాన్‌ ఆరోపించింది. ‘హత్యలు చేయడానికి దేశంలోకి పరికరాలను దిగుమతి చేయడానికి ప్రయత్నించిన ఇద్రిస్‌ అలీ, ఆజాద్‌ షోజై, రసూల్‌ అహ్మద్‌ రసూల్‌లను అరెస్టు చేసి... ఇజ్రాయెల్‌కు సహకరించినందుకు ఈ ఉదయం శిక్ష అమలు చేశారు. వారిని ఉరితీశారు’అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. 

తుర్కియే సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయవ్య నగరమైన ఉరి్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి. నీలిరంగు జైలు యూనిఫాంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోటోను కూడా కోర్టు పంచుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరాన్‌లో ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో సహా విదేశీ నిఘా సేవలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏజెంట్లను అరెస్టు చేయడం, ఉరితీయడం తరచుగా జరుగుతుంది. జూన్‌ 13న ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆ దేశంతో సంబంధాలున్న వ్యక్తులపై త్వరిత చర్యలు తీసుకుంటామని టెహ్రాన్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే దోషులుగా తేలిన అనేక మంది వ్యక్తులను ఇరాన్‌ ఉరితీసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement