నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం: యంగిస్తాన్‌! | International Youth Day 2022: Four Indian youths who are championing social causes | Sakshi
Sakshi News home page

International Youth Day 2022: యంగిస్తాన్‌!

Aug 12 2022 5:09 AM | Updated on Aug 12 2022 7:23 AM

International Youth Day 2022: Four Indian youths who are championing social causes - Sakshi

నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! అదే చైనా సగటు వయసు 37 ఏళ్లు, జపాన్‌దైతే ఏకంగా 48 ఏళ్లు. సూపర్‌ పవర్స్‌గా పేరుబడ్డ అమెరికా, చైనా వంటి దేశాల్లో వృద్ధ జనాభా నానాటికీ పెరిగిపోతోంది.

ఆ రెండు దేశాల్లో సగానికిపైగా జనాభా వృద్ధులే! 15 నుంచి 24 మధ్య వయసు వారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 16 శాతం. అదే భారత్‌లో 13 నుంచి 35 మధ్య వయసు వారు జనాభాలో ఏకంగా 66 శాతమున్నారు. అంటే మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు యువోత్సాహంతో తొణికిసలాడుతున్నారు. యువత శక్తి సామర్థ్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సింహావలోకనం చేసుకునేందుకు ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతున్నారు.

మేధో వలసలు ఆపాలి
అపార ప్రతిభ, సజనాత్మకత పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలిచే తెలివితేటలు భారత యువత సొంతం. వీటిని వాడుకుని బహుళ జాతి సంస్థలు చాలా లాభపడుతున్నాయి. మన వారిలోని ప్రతిభా పాటవాలను ఇతర దేశాలే ముందుగా గుర్తించి ఎగరేసుకుపోతున్నాయి. దాంతో మన యువత మేధో సంపత్తి దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. మన దేశం నుంచి మేధో వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాపిల్‌ ఉద్యోగుల్లో 35 శాతం, మైక్రోసాఫ్ట్‌లో 34›, ఐబీఎంలో 28, ఇంటెల్‌లో 17, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో 36 శాతం భారతీయులే! మన యువతలో చాలావరకు భారత్‌లో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడం లేదన్న అసంతప్తితో వలస బాట పడుతున్నారు. ప్రపంచ సారథిగా భారత్‌ ఎదగాలంటే ఈ మేధో వలసను తక్షణం అడ్డుకోవాలి.

దేశానికి అండదండ  
► భారత యువతలో అక్షరాస్యత 90 శాతానికి పెరిగింది. వీరంతా స్మార్ట్‌ తరం. డిజిటల్‌ ప్లాట్‌ఫారాలపై దుమ్ము రేపుతున్నారు. మన యువత నైపుణ్యాలు పెంచడానికి కేంద్రం మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది.
► యువకుల్లో 36%, యువతుల్లో 42% ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి చూపుతున్నట్టు లోక్‌నీతి–సీస్‌డీఎస్‌ తాజా సర్వే వెల్లడించింది. యువతీ యువకులు విద్యావంతులైతే ఉపాధి అవకాశాలు బాగా పెరిగి వారి భవిష్యత్తు బంగారమవుతుంది.
► ఐదేళ్ల క్రితం దాకా యువతలో 65% ఉద్యోగ భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వోద్యోగాలే కోరుకునేవారు. వారిలో క్రమంగా మార్పు వస్తోంది. సర్కారు కొలువు కోరుకునే వారు 55 శాతానికి తగ్గారు. 25% మంది సొంత వ్యాపారాలకు సిద్ధపడుతుండటం మరో మంచి పరిణామం.
► దేశ జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు 54 శాతమున్నారు. పైగా ఏటా 1.5 కోట్ల మంది పని చేసే వయసులోకి అడుగు పెడుతున్నారు.
► దేశంలోని టాప్‌ 10 స్టార్టప్‌ కంపెనీల సారథులు యువతీ యువకులే కావడం విశేషం.
► దేశ స్థూల జాతీయాదాయం(జీఎన్‌ఐ)లో 34% 15–29 మధ్య వయసున్న యువత నుంచే సమకూరుతోంది.


వచ్చే 20 ఏళ్లలోనే సాధించాలి
సూపర్‌ పవర్‌గా ఎదగాలని భారత్‌ కలలు కంటోంది. చైనాను అధిగమించి దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఇందుకు ఆశలన్నీ యువత మీదే పెట్టుకుంది. ఇలాంటి భారీ లక్ష్యాలను మనం మరో 20 ఏళ్లలోనే సాధించాలి. ఎందుకంటే ఏ దేశమైనా వృద్ధి బాట పట్టాలంటే 15 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యనున్న వారే కీలకం. ఆర్థిక వ్యవస్థకు వారే వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆ వయసు వారే  పని చేసే రంగంలో ఉంటారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. ప్రస్తుతం దేశ జనా«భాలో ఈ వయసు వారు 63% ఉన్నారు. 2036 నాటికి 65 శాతానికి చేరే అవకాశముంది. తర్వాత నెమ్మదిగా పని చేసే వారి సంఖ్య తగ్గి దేశంలో వృద్ధులు పెరిగిపోతారు. ఆ లెక్కన వచ్చే 20 ఏళ్లలో మన యువతరం ఏ మేరకు కష్టిస్తుందనే దానిమీదే భావి భారత పురోగతి ఆధారపడి ఉంది. యువతలో శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకొని వృద్ధి బాట పట్టిన దేశాల్లో చైనాతో పాటు న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా వంటివి ముందు వరుసలో ఉంటాయి.

మన యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జనాభా స్థిరీకరణ, 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల ఎకానమీ వంటి లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రభుత్వం యువతపై దృష్టి సారించాలి. వారిమీదే అధికంగా పెట్టుబడులు పెట్టాలి
– పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా 

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement