International Beer Day: బీర్‌ డే పుట్టింది ఇలా.. వెనుక పెద్ద కథే ఉంది మరి!

International Beer Day 2021 Birth Of Beer And History About Natural Drink - Sakshi

International Beer Day 2021: ‘ఈ గింజల సారా తయారు చేసినవాడు ఎవడో గానీ.. వాడు మహా మేధావి అయ్యి ఉంటాడు’.. బీరు రుచి మరిగి గ్రీకు తత్వవేత్త ప్లాటో చెప్పిన మాటలివి. మత్తులో చెప్పాడో.. మామూలుగా చెప్పాడోగానీ ఇక్కడే ఆయన బీరులో కాలేశాడు. బీరును తయారు చేసింది, చరిత్రలో ఆ పానీయానికి పెద్ద ఎత్తున్న ప్రాముఖ్యత కల్పించింది.. అంతర్జాతీయంగా ప్రచారం చేసింది, ఇప్పుడు మార్కెట్‌లో అమ్ముడుపోతున్న బీరుకు ఒక రూపం తెచ్చిపెట్టింది.. అంతా ఆడవాళ్లే. అందుకే ఈ ‘బీర్‌ డే’ నాడు మందు బాబులు.. ఆ మహిళామణులకు జోహార్లు చెప్పాల్సిందే.

సాక్షి, వెబ్‌డెస్క్‌: సుమారు ఏడువేల సంవత్సరాల క్రితం.. మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్‌ ఆసక్తికరంగా మొదలైంది. అప్పట్లో ఆడవాళ్లు బలవర్థకమైన ఆహారం(ఇమ్యూనిటీ ఫుడ్‌) కోసం అంబలి కాచుకునేవాళ్లు. అయితే కొందరు ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను జోడించి నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసుకునేవాళ్లు. వాటిని నిల్వ బెట్టడం.. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి అందించేవి. ఆపై అవి మత్తు ద్రావణాలనే ప్రచారం(ఫుల్‌గా తీసుకుంటే ఏదైనా మత్తు ఇస్తుంది కదా) జరగడంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.

అలా సారాయి(బీరు) అమ్మకాల సంప్రదాయం వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. పోను పోనూ ఆ పానీయాలకు తమ చేతివాటం ప్రదర్శిస్తూ మరింత మార్కెటింగ్‌ పెంచారని బ్రిటిష్‌ చరిత్రకారుడు సొమ్మెలియర్‌ జేన్‌ పెయిటోన్‌ చెప్పాడు. కానీ, ఈజిప్షియన్ల కాలంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు మద్యం సేవించడం, ఈ క్రమంలో ఇళ్లలోనే వాటి తయారీ ఉండేదని.. ఆ సమయంలోనూ బీర్‌లాంటి పానీయాలు చెలామణిలో ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.      

మంచి నీళ్లు, టీ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది తాగేది.. బీరు

సన్యాసి చొరవ..
మధ్యయుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం విపరీతంగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల దాకా అంతా ఆ పానీయాలకు అలవాటు అయ్యారు. అయితే పులిసిన ద్రావణాలు.. ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు. దీంతో రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి గంజాయి మొక్కలకు చెందిన హోప్స్‌ మొక్క పువ్వులను చేర్చడం.. అవి ద్రావణాలను పాడుకాకుండా ఉంచడంతో పాటు మత్తూ అందించడం మొదలైంది. జర్మనీకి చెందిన క్రైస్తవ సన్యాసి.. హిల్డెగార్డ్‌ ఆఫ్‌ బింగెన్‌(హిల్డెగార్డ్‌) విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్‌(11వ శతాబ్దంలో ఈ పేరు పెట్టింది కూడా ఈమెనే?!)కు ఒక రూపం వచ్చింది.

అయితే బలవర్థకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలన్న బుద్ధి కలిగింది మాత్రం మగవాళ్లకే. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కనపెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను చొప్పించడం మొదలుపెట్టారు.  అలా బీర్‌ వెనుక ఆడవాళ్ల కృషిని తెర వెనక్కి నెట్టేసి.. అప్పటి నుంచి బీర్ల పరిశ్రమలో కింగ్‌లుగా చెలామణి అవుతున్నారు మగవాళ్లు.  

ఇంటర్నేషనల్‌ బీర్‌ డే
అన్నట్లు..  International Beer Day ఎలా పుట్టిందో, ఇంతకీ బీర్‌ డే ఉద్దేశం తెలుసా?.. ఏం లేదు సరదాగా స్నేహితులతో నాలుగు సిప్‌లు వేస్తూ ఈ రోజును ఎంజాయ్‌ చేయడమే బీర్‌ డే ఉద్దేశం. బీర్‌ ప్రియుల కోసం బీర్‌కు జరిపే పుట్టిన రోజు ఇది.  2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్‌ అనే తాగుబోతు.. ఈ బీర్‌ డే పుట్టుకకు కారణం. 2012 దాకా ఆగష్టు 5నే ఇంటర్నేషనల్‌ బీర్‌ డేను చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఆగష్టు మొదటి శుక్రవారంను బీర్‌ డేగా నిర్వహించుకోవాలని మందుబాబులకు సూచించాడు జెస్సే. అలా పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈరోజు.. ఇప్పుడు దాదాపు 80కిపైగా దేశాల్లో, ప్రధానంగా 200 నగరాల్లో ఈ బీర్‌ వేడుకలను నిర్వహించుకుంటున్నారు మందుబాబులు. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. ఆ లెక్కన ఇవాళ(ఆగష్టు 6) ఇంటర్నేషనల్‌ బీర్‌ డే అన్నమాట. 


బీర్‌ మీద కొన్ని అపోహలు
అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థమే. అది ఆల్కహాల్‌ విషయంలోనూ వర్తిస్తుంది. ఓ మోస్తరుగా ఆల్కహాల్‌ తీసుకుంటే ఫర్వాలేదని డాక్టర్లే చెప్తుంటారు.  ఇది బీర్‌కు కూడా వర్తిస్తుంది. చాలా అధ్యయనాల్లో సైంటిఫిక్‌గా రుజువయ్యింది ఏంటంటే.. మోస్తరు మందు తాగేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారని!.  నమ్మమని అంటారా?.. ఎవరి ఇష్టం వాళ్లది!

►బీరు.. సహజంగా తయారు చేసేదే. వీటిని కల్తీ చేయాలని ప్రయత్నిస్తే.. చెడిపోతుంది కూడా. ఇక బీర్‌లో క్యాలరీలు-కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయని సైంటిఫిక్‌గా రుజువైంది. అలాగే ఇందులో కొవ్వు-కొలెస్ట్రాల్‌ పర్సంటేజ్‌ ఉండవని కూడా తేలింది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌-క్లినికే మెడిసిన్‌ యూనివర్సిటీ(ప్రేగ్‌) సంయుక్తంగా బీర్‌పై పరిశోధనలు నిర్వమించాయి.  బీర్‌ తాగితే లావు అవుతారని చెప్పడం, బొజ్జ పెరుగుతుందనే ప్రచారం అంతా ఉత్తవేనని ఈ పరిశోధనలు సైంటిఫిక్‌గా నిరూపించాయి. 

►ఒకానొక టైంలో నీళ్ల కంటే బీరు పదిలం అనే ప్రచారం జరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్యాకింగ్‌ వాటర్‌లో కల్తీ జరిగే అవకాశం ఉన్నా.. బీర్‌లో(మరిగించి.. సీల్‌ వేయడం) ఆ ఛాన్స్‌ అస్సలు ఉండదని చెప్తుంటారు రీసెర్చర్లు. కానీ, ఈ రోజుల్లో కల్తీ కానిది ఏది చెప్పండి!. ఇక స్నేహితులతో సరదాగా ఛిల్‌ కావడానికి బీర్‌ కొట్టడం ఒక అలవాటు(అలవాటు ఉన్నవాళ్లకు మాత్రమే). కాలాలతో సంబంధం లేకుండా తీసుకునే ఆల్కాహాల్‌గా.. సమ్మర్‌లో చల్లని పానీయంగా బీర్‌ సేల్స్‌ విపరీతంగా ఉంటాయి. 

►అన్‌ఫిల్టర్‌-లైట్‌ఫిల్టర్‌ బీర్లలో ‘విటమిన్‌-బి’ సమృద్ధిగా ఉంటుంది. గింజల పానీయాన్ని షుగర్‌తో పులియబెట్టినప్పుడు.. గుండె జబ్బులను అరికట్టే ఫొలిక్‌ యాసిడ్‌ పుడుతుందనేది పరిశోధనల్లో(2014) వెల్లడైంది. అయితే అమెరికన్‌ హార్ట్‌ అసోషియేషన్‌ మాత్రం దీనిని కచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 

►హోప్స్‌లో గ్జాంథోహూమోల్‌ అనే ఫ్లేవనాయిడ్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కారక ఎంజైములను నిరోధించే పొటెంట్‌ యాంటీయాక్సిడెంట్‌. అందుకే జర్మన్‌లు దీనిని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. బీర్‌ మెటాబాలిజంను సక్రమంగా నడిపిస్తుందని నిరూపించిన అధ్యయనాలూ ఉన్నాయి. ఇవిగాక బీర్‌ తయారీ, ప్యాకింగ్‌, యాడ్స్‌, అమ్మకాలు.. ఇలా వ్యాపారపరంగా బీర్‌ అందించే లాభాలు.. వేల కోట్లలో ఉంటాయి. 

బీర్‌ వీళ్లకు వద్దు
బీర్‌తో బెనిఫిట్స్‌ మాత్రమే చెప్పుకోకూడదు కదా. అందుకే ఉన్న ప్రతికూల ప్రభావాలను చర్చిద్దాం. 
♦గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లుళ్లు
♦ఎలర్జీ-చర్మ వ్యాధులు ఉన్నవాళ్లు
♦నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు


♦కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు
♦అల్సర్‌, గుండెలో మంట సమస్యలు ఉన్నవాళ్లు
♦ చిన్నపిల్లలు.. తదితరులు 
   
చివరగా.. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక అందరికీ తెలుసు!.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top