
జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్ లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.
ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్ తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది. ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.