అమెరికాలో ఏం జరుగుతోంది.. శ్రేయాస్‌ రెడ్డి మృతి | Indian Student Shreyas Reddy Found Dead In US, Third Incident In A Week - Sakshi
Sakshi News home page

Indian Students Deaths In US: వరుసగా భారత విద్యార్థులు మృతి.. ఏం జరుగుతోంది?

Published Fri, Feb 2 2024 7:40 AM

Indian Student Shreyas Reddy Found Dead In US - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అయితే, శ్రేయాస్‌రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.

మరోవైపు.. వారం రోజుల వ్యవధిలోనే ఇలా విద్యార్థులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. ఇ‍ప్పటి వరకు మృతిచెందిన భారత విద్యార్ధులు వీరే..

వివేక్ సైనీ
ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు.

నీల్ ఆచార్య
ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఆదిత్య అద్లాఖా
ఇటీవలే ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని హత్యకు గురయ్యారు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. 

Advertisement
Advertisement