Sakshi News home page

Sophia Duleep Singh: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు?

Published Thu, Sep 14 2023 7:36 AM

Indian Princess who Fought for Vote of Women in Britain - Sakshi

భారతదేశానికి చెందిన ఒక యువరాణి మహిళల ఓటు హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె కారణంగానే బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ ఉద్యమం కోసం ఆమె తన రాజ కీయ హోదాను కూడా పక్కన పెట్టారు. అయితే కాలక్రమేణా ఆమె చరిత్ర మరుగున పడింది. ఇంతకీ ఆ భారతీయ యువరాణి ఎవరు? ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు గురించి ఎందుకు పోరాడవలసి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆ యువరాణి మరెవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా దులీప్ సింగ్. ఈమె బ్రిటన్‌లోని నార్ఫోక్-సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్‌లో పెరిగారు. భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ పాలకులు 1840లో మహారాజా దులీప్ సింగ్‌ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతనిని బ్రిటన్‌కు తరలించారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి దులీప్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత తనకు అందిన పరిహారపు సొమ్ముతో ఆయన ఎల్వెడీన్‌ హాల్‌ను కొనుగోలు చేశారు. అతను తన పిల్లలతో సహా అక్కడే ఉండేవారు. 

బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, యువరాణి సోఫియా 1900లలో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ నేపధ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజకుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లో అపార్ట్‌మెంట్ అప్పగించారు. సోఫియా దులీప్ సింగ్‌ను ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ అని పిలుస్తారు. ఈ కారణంతోనే ప్రిన్సెస్ సోఫియా బ్రిటీష్ మహిళల మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్‌లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని భావించారు. ప్రిన్సెస్ సోఫియా ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్‌ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్‌లో సభ్యురాలు. ఈ లీగ్ మహిళల ఓటు హక్కు కోసం ‘నోట్ నో టాక్స్’ నినాదం అందుకున్నారు. 

యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మహిళా ఓటు హక్కు కార్యకర్త ఎమ్మెలిన్ పాన్‌ఖర్స్ట్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరిగిన రోజున ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా నినాదాలు చేయడం లేదా నిరసనలలో పాల్గొనడం మాత్రమే కాకుండా, హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లోని తన ఇంటి వెలుపల  మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను విక్రయించారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది.

మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగా బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు. 1876లో జన్మించిన ఆమె 1903లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఇది ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్‌ సాగించిన పోరాట పటిమకు ఆమె ప్రభావితురాలయ్యారు. ఇదే ఆమెను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రేరేపణ కల్పించింది. ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు పోరాటం కొనసాగించేందుకు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె మహిళా ఓటుహక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

ఆమె నిరసనలలో పాల్గొంటున్న కారణంగా ఇంగ్లండ్‌లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె దానిని పట్టించుకోలేదు. ప్రిన్సెస్‌ సోఫియా బ్రిటన్‌ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాలుపంచుకున్నారు. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సహాయం అందించారు. ఆమె బ్లూ ఫ్లాక్ అవార్డును అందుకున్నారు. యువరాణి సోఫియా 1948లో తన 71 ఏళ్ల వయసులో  కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?

Advertisement

What’s your opinion

Advertisement