
డబ్లిన్: ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యువకునిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఆ యువకుడు తన అపార్ట్‌మెంట్‌కు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఆరుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్‌లో తాను ప్రేరేపిత జాత్యహంకార దాడిని ఎదుర్కొన్నానని భారత సంతతికి చెందిన డాక్టర్ సంతోష్ యాదవ్ ఘటనా క్రమాన్ని ‘లింక్డ్‌ఇన్’లో వివరించాడు.
ఐర్లాండ్‌లో జాత్యహంకార యువకుల బృందం తనపై దాడి చేసిందని డాక్టర్ సంతోష్ యాదవ్ ఆరోపించారు.‘నేను రాత్రి భోజనం చేసిన తర్వాత, నా అపార్ట్‌మెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆరుగురు యువకుల బృందం నాపై వెనుక నుంచి దాడి చేసింది. తరువాత వారు నా కళ్లద్దాలను లాక్కొని, వాటిని పగలగొట్టి, నా తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపై ఆగకుండా కొట్టారు. దీంతో నాకు తీవ్ర రక్తస్రావం అయింది. గార్డ్‌కు కాల్ చేసి,విషయం చెప్పాను. అంబులెన్స్ నన్ను బ్లాంచర్డ్స్‌టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా చెంప ఎముక విరిగిందని వైద్య బృందం నిర్ధారించింది. ఇప్పుడు నన్ను ప్రత్యేక వైద్యసంరక్షణ కోసం రిఫర్ చేశారు’ అని సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.
ఐర్లాండ్‌లో మైనారిటీలపై హింస పెరుగుతున్నదని, అయినా అధికారులు నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్ యాదవ్ ఆరోపించారు. దాడులు చేశాక వారు స్వేచ్ఛగా పారిపోతున్నారని, తిరిగి దాడి చేయడానికి ధైర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను సంతోష్ యాదవ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
యాదవ్ తన పోస్ట్‌లో రెండు ఫోటోలను ఉంచారు. ఒక ఫొటోలో అతని ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండగా, మరొక ఫోటోలో అతని చేతిలో విరిగిన కంటి అద్దాలు ఉన్నాయి. డాక్టర్ సంతోష్ యాదవ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేశాడు. తరువాత ఘజియాబాద్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుండి పీహెచ్‌డీ చేసాడు. ప్రస్తుతం సంతోష్ యాదవ్ సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉంటున్న ఆయన ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు.