భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. షక్సాగామ్ వ్యాలీలో చైనా మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించదని తేల్చిచెప్పారు. 1963లో చైనా-పాక్ మధ్య జరిగిన భూబదిలీ ఒప్పందాన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించేది లేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.
కాగా షక్సాగామ్ వ్యాలిలో చైనా చేపడుతున్న నిర్మాణాలపై జనవరి 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భూమిపై పాక్- చైనా చేసుకున్న ఒప్పందం ఎప్పటికీ చెల్లదు. దీనిని భారత్ ఎప్పటికీ గుర్తించదని ప్రకటించింది. అయితే దానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో వింగ్ నిన్న (సోమవారం) స్పందించారు. 1963లోనే ఈ భూభాగంపై పాకిస్థాన్-చైనా అంగీకారం చేసుకున్నాయని ఇప్పుడు దానిపై స్పందించడానికి భారత్‌కు అవకాశం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేదీ తాజాగా స్పందించారు.
జనరల్ ద్వివేదీ మాట్లాడుతూ " ఈ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను భారత్ గుర్తించదు. షక్సాగామ్‌పై 1963లో పాక్‌తో చేసుకున్న ఒప్పందం ఎట్టిపరిస్తితుల్లో చెల్లదు. అక్కడ కట్టే నిర్మాణాలను అక్రమ కట్టడాలుగానే భారత్ భావిస్తోంది" అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని కూడా జనరల్ ద్వివేదీ స్పష్టం చేశారు.
షక్సాగామ్ వివాదం
షక్సాగామ్ లోయ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉంది. దీనిని పాకిస్థాన్ 1963లో జరిగిన ఒప్పందంలో భాగంగా చైనాకు అప్పగించింది. ఆ భూమిలో ప్రస్తుతం చైనా రహదారులు, సైనికస్థావరాలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తుంది.


