
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తున్నదన్నారు. కాగా ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జనీరో డిక్లరేషన్ పేర్కొంది. కాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.