విపత్తు దిశగా పాక్‌.. దేశం విచ్ఛిన్నం కావొచ్చు: ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Imran Khan Warns Of Imminent Disaster To Pakistan - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు.

పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. తూర్పు పాకిస్తాన్‌ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు.

తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. 

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్‌ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌ సుప్రీం కోర్టు,  ఇస్లామాబాద్‌ హైకోర్టులు ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్‌ ప్రకటించారు కూడా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top