పవర్‌ఫుల్‌ దేశం భారత్‌కు అండగా ఉంది.. ఇ‍మ్రాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ‍్యలు

Imran Khan Says Powerful Country Is Backing India - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ‍్యలు చేసి ఇమ్రాన్‌ వార్తల్లో నిలిచారు.

ఇస్లామాబాద్‌లో శుక్ర‌వారం భ‌ద్ర‌త‌పై ఓ సెమినార్ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘ నేను ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం వ‌ల్లే అమెరికా నాపై తీవ్ర కోపాన్ని పెంచుకుంది. తప్పు అంతా పాకిస్థాన్‌దే.. ప్రతిపక్షాల కారణంగా ప్ర‌పంచ ప‌టంపై పాక్ బ‌ల‌హీన‌ప‌డింది. మేము అన్ని దేశాలను గౌరవిస్తాం.. కానీ.. ఓ దేశాన్ని మ‌రో దేశం బెదిరించ‌వ‌చ్చా?. భారత్‌కు ఓ ప‌వ‌ర్ ఫుల్ దేశం మద్ద‌తిస్తూ మాట్లాడింది. ఇండియా ఓ స్వ‌తంత్ర దేశ‌ం, భారత్‌కు ఏమీ చెప్ప‌లేమ‌ని బ్రిట‌న్ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి అన్నారు. అయితే, భారత్‌కు మద్దతు ఇచ్చినందుకు నాకేమీ బాధలేదు. పాకిస్తాన్‌ నేతల వల్లే సమస్య’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, దానికి సంబంధించిన లేఖ కూడా ఉందంటూ చేసిన వ్యాఖ్య‌లను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్‌ చెబుతున్నట్లుగా పాకిస్థాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

అయితే, గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్‌ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్‌ జరుగనుంది.

ఇది చదవండి: భారత్‌కు బంపర్‌ ఆఫర్‌.. టెన్షన్‌లో అమెరికా..?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top