Iceland volcano: భూగర్భంలో భుగభుగలు | Sakshi
Sakshi News home page

Iceland volcano: భూగర్భంలో భుగభుగలు

Published Sat, Feb 10 2024 5:10 AM

Iceland volcano: Iceland volcano erupts with lava fountains, disrupts heating and roads - Sakshi

అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్‌ సినిమాలా ఉంది కదూ!

ఐస్‌లాండ్‌లో పశ్చిమ రెగ్జానెస్‌ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్‌ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...!

ఐస్‌లాండ్‌ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్‌ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్‌ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.

లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్‌ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్‌ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్‌ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్‌ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట.

ఇది డాన్యుబ్‌ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్‌ ఐస్‌లాండ్‌లోని నోర్డిక్‌ వోల్కెనోలాజికల్‌ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఫ్రెస్టెనిన్‌ సిగ్మండ్సన్‌ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు.

ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్‌ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది.

భవిష్యత్తుపై ఆందోళన
తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్‌తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్‌ సిగ్మండ్సన్‌ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు.

అగ్నిపర్వతాల పుట్టిల్లు
ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్‌లాండ్‌కు పేరుంది. అందుకే దాన్ని లాండ్‌ ఆఫ్‌ ఫైర్‌ అండ్‌ ఐస్‌ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్‌లాండ్‌ మిడ్‌ అట్లాంటిక్‌ రిడ్జ్‌ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement