మానవ వంశవృక్షం లెక్కతేల్చారు..

The Human Genealogy Calculated - Sakshi

ఈ రోజు ఈ భూమ్మీద సుమారుగా 795 కోట్ల మంది జనమున్నారు. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతోంది కూడా.. ఇంతకీ మీరెప్పుడైనా ఆలోచించారా.. అసలు మనకన్నా ముందు ఈ భూమ్మీద ఎంతమంది జనం నివసించి ఉండి ఉంటారని.. ఎంత మంది పుట్టి.. చనిపోయి ఉంటారని.. అసలు కచ్చితంగా మన పూర్వీకులెంతమంది అని.. లేదు కదూ..నిజానికి అలా లెక్కగట్టడం సాధ్యమేనా?

అసలీ లెక్కలేంటి? 

      కార్ల్‌ హాబ్‌                                    తోషికో కనెడా
సాధ్యమేనని అంటున్నారు డెమోగ్రాఫర్స్‌ తోషికో కనెడా, కార్ల్‌ హాబ్‌లు. డెమోగ్రాఫర్‌ అంటే.. జనాభా పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడంలో నిపుణులు అన్నమాట. మన పూర్వీకుల సంఖ్యను లెక్కించడానికి ఈ జనాభా శాస్త్రవేత్తలు క్రీ.పూ. 190000ని బెంచ్‌మార్క్‌ కింద తీసుకున్నారు. ఎందుకంటే.. మన అసలు సిసలు పూర్వీకుడైన ఆధునిక హోమోసెపియన్‌ నివసించిన కాలమది. దీని ప్రకారం మనకు ముందు 10,900 కోట్ల మంది మానవులు ఈ భూమ్మీద జన్మించి, మరణించారని తేల్చారు. దానికి ఇప్పుడున్న జనాభాను కలిపితే.. ఇప్పటివరకూ మొత్తంగా 11,695 కోట్ల మంది ఈ భూమ్మీద నివసించినట్లు అన్నమాట.  

ఈ లెక్కకు ఆధారం ఏంటి? 
ఇందుకోసం వారు మూడు అంశాలను ఆధారంగా చేసుకున్నారు.  
1.    మానవులు ఈ భూమ్మీద నివసించారు అని భావిస్తున్న కాల వ్యవధి.  
2.    నాటి నుంచి నేటి దాకా.. వివిధ కాలాల్లో సగటు జనాభా పరిణామం. 
3.    ఆయా కాలాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల సంఖ్య..  

మొత్తంలో మనమెంత?
ప్రస్తుత జనాభా(795 కోట్లు)ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటివరకూ భూమ్మీద నివసించిన మొత్తం మానవుల సంఖ్యలో మన వాటా 7% అని జనాభా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు.. 2050 నాటికి మరో 400 కోట్ల జననాలు కలుపుకుంటే.. అప్పటికీ ఈ భూమ్మీద నివసించిన మానవుల సంఖ్య సుమారు 12,100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. 

రుణపడి ఉండాల్సిందే.. 

నిజానికి ఈ 10900 కోట్ల మందికి మనం రుణపడి ఉండాలని ‘అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా’సంస్థకు చెందిన మాక్స్‌ రోజర్‌ అన్నారు. ‘‘ఈ ఆధునిక నాగరికత కోసం.. మనం మాట్లాడుతున్నఈ భాషల కోసం.. మనం వండుతున్న ఈ వంటల కోసం..మనం వింటున్న ఈ సంగీతం కోసం.. మనం వాడుతున్న ఆధునిక పరికరాల కోసం.. మనం వారికి థాంక్స్‌ చెప్పాల్సిందే. మనకు ఇప్పుడు తెలిసినదంతా.. వారి నుంచి నేర్చుకున్నదే. మనముంటున్న ఇళ్లు.. వాడుతున్న మౌలిక సదుపాయాలు, వివిధ రంగాల్లో గొప్పగొప్ప ఘనతలు.. మన చుట్టూ ఉన్నదంతా మన పూర్వీకులు.. మనముందున్నవారు నిర్మించి ఇచ్చినదే..’’అని ఆయన అన్నారు.

మాక్స్‌ చెప్పిందీ నిజమే మరి..  
మనం ఇంతకు 
ముందెప్పుడూ చెప్పిందీ లేదు..  
అందుకే ఈసారైనా చెప్పేద్దాం.. 
తాతగారూ..
ముత్తాతగారూ.. 
థాంక్యూ 

-సాక్షి సెంట్రల్‌ డెస్క్‌..  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top