
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
సందర్భం
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1990 జూలై 11 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌గా ‘న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకొనే కుటుంబాలను సృష్టించడానికి యువతను సాధికారం చేయడం’ను ఎంచు కొన్నారు.
మనిషే మూలధనం
ప్రపంచ జనాభా 2011లో 700 కోట్ల నుండి 2022లో 800 కోట్లకు పెరిగింది. 2025లో 820 కోట్లకు చేరుకుంది. వనరుల కొరత, పర్యావరణ క్షీణత, వలసలు, పట్టణీకరణ, అధిక వృద్ధాప్య జనాభా, బాల కార్మికులు, సామాజిక అసమానతలు లాంటి సమస్యలకు జనాభా పెరుగుదల దారి తీసింది.
సుస్థిరతపై జనాభా ప్రభావం ముఖ్యాంశంగా నిలుస్తున్నందువల్ల ప్రపంచ దేశాలు ఈ సమస్యను అధిగమించవలసి ఉంది. సీఎమ్‌ఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) 2023 నివేదిక ప్రకారం, భారత్‌లో యువతలో నిరుద్యోగిత 23 శాతం కాగా, గ్రామీణ యువత అల్ప ఉద్యోగిత, ఉపాధి లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది.
భారత్ జనాభా 2001లో 102.87 కోట్ల నుండి 2011లో 121.09 కోట్లకు, 2025లో 146.39 కోట్లకు పెరిగింది. అయితే, సంతానోత్పత్తి రేటు (1.9), రీప్లేస్‌మెంట్ స్థాయికన్నా (2.1) తక్కువగా నమోద యింది. ఈ స్థితిని ఐక్యరాజ్యసమితి జనాభా సంక్షోభంగా అభివర్ణించింది. కాకపోతే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్’ రిపోర్ట్– 2025 ప్రకారం, మొత్తం జనాభాలో 15–64 వయోవర్గ జనాభా 68 శాతంగా ఉండటాన్ని బట్టి భవిష్యత్తులో భారత్ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ పొందుతుంది.
ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ద్వారా భారత్ సుస్థిరవృద్ధి సాధించాలంటే వ్యూహాత్మక పెట్టుబడులు, అభిలషణీయ విధానాల అమలుపై దృష్టి సారించాలి. మానవ మూల ధనంపై పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంపొందించి, సమ్మిళిత వృద్ధి, పర్యావరణ సుస్థిరతతోపాటు దీర్ఘకాల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక ప్రగతికి దారితీస్తాయి.
సుస్థిర వృద్ధి సాధనకు సవాళ్ళు
భారత్‌లో పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు చేరుతుందని అంచనా. భూగర్భ జలాలు 2030 నాటికి 21 నగరాలలో అడుగంటుతాయని అంచనా. దాంతో ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. భూమి, నీరు, శక్తి, జీవ వైవిధ్యంపై ఒత్తిడి అధికమవుతుంది. మితిమీరిన సాగు, అడవుల నరికివేత, పట్టణాలలో భూముల ఆక్ర మణ కారణంగా భారత్ మొత్తం భూవిస్తీర్ణంలో 29.7 శాతం డీగ్రేడెడ్ భూమిగా వర్గీకరింపబడింది.
భారత్‌లో సాంవత్సరిక ఘన వ్యర్థాలు 6.2 కోట్ల టన్నులు కాగా, ఈ మొత్తంలో 70 శాతాన్ని సేకరిస్తున్నప్పటికీ, దీనిలో 20 శాతంకన్నా తక్కువే ప్రాసెస్ అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ప్రతి సంవత్సరం 16 లక్షల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్షణ పరిమితుల కన్నా ఢిల్లీ, ముంబై నగ రాల్లో పీఎం 2.5 స్థాయులు ఎక్కువున్నాయి.
రాష్ట్రాల మధ్య జనాభా వైవిధ్యాలు భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవా భివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సామాజిక సేవలపై అధికంగా పెట్టు బడులు పెడుతున్న కారణంగా ఆ యా రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు తగ్గి వృద్ధాప్య వయోవర్గ జనాభా పెరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బల హీనంగా ఉండటంతోపాటు, అందరికీ విద్య అందుబాటు తక్కు వగా, లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం, పాఠశాల విద్యకు నోచుకోని మహిళలు సగటున 3.1 పిల్లలకు జన్మ నివ్వగా, 12వ తరగతి మరియు ఆ పైన విద్యాధికులైన మహిళలు సగటున 1.7 పిల్లలకు జన్మనిచ్చారు. విద్యకు సంబంధించి బిహార్, రాజస్థాన్‌లలో లింగ అసమానతలు అధికం.
పర్యావరణ హితంగా సమాజ సంక్షేమం
వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణతో జనాభా వృద్ధిని సంతుల్యం (బ్యాలెన్స్) చేయడం సుస్థిరాభివృద్ధికి ప్రధానం. ఆర్థిక విధానాలలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానతను సంఘటిత పరచడం ద్వారా భవిష్యత్ తరాల అవసరాలతో రాజీ పడకుండా, ప్రస్తుత అవసరాలను తీర్చవచ్చు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న పరస్పర అనుసంధానాన్ని అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు కనుగొన్నట్లయితే అన్ని అంశాల్లోనూ ఒకేసారి ప్రయోజనం కలుగుతుంది.
పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి బహుముఖ విధానం అవసరం. ఈ లక్ష్య సాధనకు సుస్థిర పద్ధతులు అవలంబించడం, పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెట్టడం అవ సరం. ఈ చర్యలు పర్యావరణ ప్రభావాన్ని కనిష్ఠం చేసి, ఆర్థిక వృద్ధి పెంపునకు దోహదపడతాయి. బాధ్యతాయుత పర్యాటక పద్ధతులు పాటించినప్పుడు పర్యావరణ వ్యవస్థ పరిరక్షించబడి, స్థానిక ప్రజలు ప్రయోజనం పొందుతారు.
గత దశాబ్ద కాలంలో అనేక ప్రభుత్వాలు సంప్రదాయ ఆర్థిక నమూనాకు బదులుగా గ్రీన్ ఎకానమీని ప్రత్యామ్నాయంగా ఎంచు కోవడం జరిగింది. గ్రీన్ టెక్నాలజీని సమర్థవంతంగా ప్రోత్సహించాలంటే ఆర్థిక ప్రోత్సాహకాలు, నియంత్రణ సంస్థల మద్దతు, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అంతర్జాతీయ సహ కారం ద్వారా నవ కల్పనలను ప్రోత్సహించాలి. ఆర్థిక ప్రోత్సాహ కాలలో భాగంగా టాక్స్ క్రెడిట్, గ్రాంటు ఇస్తూ, సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్ లాంటి పునరుత్పాదక శక్తి ఏర్పాట్లకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలి. పరిశోధన–అభివృద్ధికి (ఆర్ అండ్ డీ) ఆర్థిక మద్దతునందించాలి.
విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలను అందరికీ అందించటం ద్వారా సామాజిక సమ్మిళితం సాధించాలి. పర్యావరణ కార్యక్రమాలయిన రీఫారెస్టేషన్, వృథా యాజమాన్య కార్యక్రమా లలో వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా, సామాజిక, పర్యావరణ అంశాలను సంఘటితపరచవచ్చు. అసంఘటిత రంగంలోని సంస్థల యాజమాన్యానికి సుస్థిరాభివృద్ధి పద్ధ తులు అవలంబించే విషయంలో సరైన పరిజ్ఞానం లేకపోవచ్చు. సుస్థిరాభివృద్ధి విధానాల అమలు, వనరుల యాజమాన్యం, అంద రికీ సమాన అవకాశాల కల్పనకు పటిష్ఠమైన సంస్థలు, సమర్థవంత మైన గవర్నెన్స్ అవసరం.
వినియోగదారులను కూడా సుస్థిర ఉత్పత్తుల వినియోగం వైపు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. వనరుల విని యోగం తగ్గుదలకు, తక్కువ వృథాకు సుస్థిర పద్ధతులు తోడ్పడు తాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. సామాజిక ప్రాధాన్య తలో భాగంగా న్యాయమైన వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, విద్య – ఆరోగ్య సంరక్షణ, సంస్కృతిని కాపాడుకోవడం అవసరం. పర్యావరణ సుస్థిరత, సామాజిక ప్రాధాన్యతలు దీర్ఘకాలంలో సమ్మి ళిత వృద్ధి సాధనకు దోహదపడతాయి. మానవ మూలధనంపై పెట్టు బడులు ఆర్థిక వృద్ధి పెంపునకు అత్యవసరం.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త ప్రొఫెసర్ – డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఈ, హైదరాబాద్