
1,00,000 చేరువకు శతాధిక వృద్ధులు
టోక్యో: ‘శతమానం భవతి’ అని పెద్దలు ఆశీర్వదిస్తారు. వందేళ్లు దీర్ఘాయుష్షుతో హాయిగా జీవించాలని కోరుకుంటారు. క్రమశిక్షణతో హాయిగా జీవించే జపాన్‌వాసులకు ఈ ‘శతమానం భవతి’ ఆశీస్సులు తెలుసోలేదో మనకు తెలీదుగానీ నిజంగానే వాళ్లు వందేళ్లు జీవిస్తున్నారు. ఆరోగ్యవంతులకు చిరునామాగా నిలిచే జపాన్‌లో శతాధిక వృద్ధుల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగిందని తాజా గణాంకాల్లో తేలింది. ఇప్పడు జపాన్ వ్యాప్తంగా వందేళ్లు వయసు పైబడిన పౌరుల సంఖ్య దాదాపు 1,00,000 అని అక్కడి ప్రభుత్వ గణాంకాలు తాజాగా పేర్కొన్నాయి.
ఇలా శతాధిక వృద్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోవడం ఇది వరసగా 55వ సంవత్సరం కావడం విశేషం. ఇది కూడా ఒక రికార్డే. ‘‘అత్యంత ఖచ్చితంగా చెప్పాలంటే శుక్రవారం నాటికి దేశంలో వందేళ్లుదాటిన వృద్ధుల సంఖ్య 99,763. అందులో 88 శాతం మంది మహిళలే’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనిషి అత్యధిక ఆయుర్దాయం జపాన్‌లోనే నమోదవుతోంది.
జపాన్‌వాసులు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం వయసుపరంగా ప్రపంచంలో అత్యంత వృద్ధుడు సైతం జపాన్‌పౌరుడే కావడం గమ నార్హం. ఇంత ఆరోగ్యవంతులున్న జపాన్‌లో అత్యల్ప జననరేటు నమోదుకావడం విచిత్రం. జపాన్‌లో అత్యంత వృద్ధ మహిళగా నరా సిటీలోని యమటోకొరియమా ప్రాంతానికి చెందిన షిగెమో కగవా రికార్డులకు ఎక్కారు. ఈమె వయసు 114 సంవత్సరాలు. ఇవాటా తీరపట్టణంలో జీవించే కియోటమా మిజినోను పురుషుల్లో అత్యంత వృద్ధుడిగా పేర్కొంటారు. ఈయన వయసు 111 సంవత్సరాలు.
87,784 మంది మహిళలే
మొత్తం 99,763 మంది శతాధిక వృద్ధుల్లో 87,784 మంది మహిళలే కావడం విశేషం. ‘‘వందేళ్లు పైబడిన వారిలో 11,979 మంది పురుషులు ఉన్నారు. తమ జీవనకాలమంతా జపాన్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వీళ్లందరినీ చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది’’ అని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి తకమరో ఫుకోకా వ్యాఖ్యానించారు. జపాన్‌లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన జరిపే ‘‘ వృద్ధుల దినోత్సవం’ను పురస్కరించుకుని ‘సెంచరీ’ కొట్టిన పౌరుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఎల్డర్స్ డేను జపాన్ జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా ఈ ఏడాది సెంచరీ కొట్టిన వాళ్లకు స్వయంగా దేశ ప్రధాని నుంచి ప్రశంసా పత్రం, వెండి కప్ బహుమతిగా అందనుంది. ఈ ఏడాది ఏకంగా 52,310 మందిని సత్కరించి ఈ పత్రం, కప్‌ను బహూకరించనున్నారు.
గతంతో పోలిస్తే మెరుగైన సంఖ్య
1960వ దశకంలో వందేళ్లుపైబడిన పౌరుల సంఖ్య జపాన్‌లో చాలా అత్యల్పంగా ఉండేది. 1963లో చేసిన ఒక సర్వే ప్రకారం దేశంలో కేవలం 153 మంది మాత్రమే
‘సెంచరీ’ కొట్టారు. 1981 ఏడాదికి వచ్చేసరికి ఈ సంఖ్య తొలిసారిగా వేయి దాటింది. 1998 ఏడాదికల్లా ఈ సంఖ్య 10,000 దాటింది. దీంతో జపాన్‌లో ఆయుర్దాయం పెరిగిన విషయం ఆధారసహితంగా స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా మారిన జీవనశైలి, కాలుష్యం ఇతరత్రా కారణాలతో ప్రజలకు హృద్రోగం, క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్‌ల ముప్పు ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజల సంఖ్య అనూహ్యంగా ఎక్కువైంది. కానీ జపాన్‌లో ఈ వ్యాధుల బెడద చాలా తక్కువ. దీంతో మరణాల సంభవం తగ్గిపోయింది.
ఆరోగ్యమయ విధానాలకు జై
సంప్రదాయ ఆహారం, వ్యాయామం వంటి ఆరోగ్యమయ పద్ధతులను జపాన్‌వాసులు తూ.చ.తప్పకుండా పాటిస్తూ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకుంటూ హాయిగా వందేళ్లు జీవిస్తున్నారు. క్యాన్సర్లు, గుండె జబ్బులకు అధిక బరువుతో అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం ఏర్పడకుండా జపాన్ వాసులు ఒబెసిటీకి ఆమడదూరంలో ఉండిపోతున్నారు. మేక, గొర్రె, వేటమాంసం తక్కువ తింటూ ఆకుకూరలు, కూరగాయలు, చేపలు అధికంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఒబెసిటీ సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి.
అందుకే శతాధిక వృద్ధుల్లో 88 శాతం వాళ్లే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలను చక్కెర, ఉప్పు చుట్టేసి చుక్కలు చూపిస్తుంటే జపాన్ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ప్రచారం భారీ ఎత్తున మొదలెట్టి దాదాపు సఫలీకృతమైంది. అధిక ఉప్పు అనర్ధాలపై జపాన్‌వాసుల్లో ప్రభుత్వం అవగాహన పెంచింది. వృద్ధాప్యఛాయలు వచ్చాక కూడా అక్కడి ప్రజలు విశ్రాంతి తీసుకోరు. వ్యక్తిగత, వృత్తిగత వ్యాపకాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. దీంతో అధిక కొవ్వు ఈ అధిక శ్రమతో కరిగిపోయి అధికబరువు సమస్యల వలయంలో చిక్కుకుపోరు.
1928 నుంచి దైనందినం..
1928 నుంచి జపాన్‌లో దైనందిన బృంద సాధన అనేది అక్కడ నిత్యకృత్యమైంది. రేడియో టైసో అనే కార్యక్రమం అక్కడ విశేష ఆదరణ పొందింది. సమాజం సమూహంగా బతకాలని, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని బోధిస్తూ సాగే టీవీ కార్యక్రమం అది. రోజూ కేవలం మూడు నిమిషాలపాటు సాగే ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని జపాన్‌వాసులు తప్పక ఆచరిస్తారు. చేతులు,కాళ్లు ముందుకు వెనక్కి చాపడం వంటి చిన్న చిన్న వ్యాయామాలను అందులో సూచిస్తారు. రోజూ వాటిని చేసి, మళ్లీ ఖాళీ సమయాల్లోనూ వ్యాయామం చేయడంతో అక్కడి ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరిగిపోయింది. ఇలా జపాన్ వాసులు ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘‘లేజీగా ఒళ్లు పెంచుకోక. నాజూగ్గా ఉంచు తీగలాగ’’ అనే సినీకవి వ్యాఖ్యలను ఇకనైనా మెజారిటీ భారతీయులు ఆచరిస్తారేమో చూడాలిమరి.