హౌతీ దెబ్బకు వణుకుతున్న సౌదీ?.. లక్షల కోట్లు బుగ్గిపాలేనా? | Houthis challenge to Saudi Arabia defense system | Sakshi
Sakshi News home page

హౌతీ దెబ్బకు వణుకుతున్న సౌదీ?.. లక్షల కోట్లు బుగ్గిపాలేనా?

Oct 12 2026 5:15 PM | Updated on Oct 12 2026 5:30 PM

Houthis challenge to Saudi Arabia defense system

రియాద్‌ : ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో ముందున్న సౌదీ అరేబియాకు.. హౌతీ తిరుగుబాటుదారుల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. గతేడాది సుమారు 83 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా) రక్షణ బడ్జెట్ కింద వెచ్చించినప్పటికీ, హౌతీలు ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ల దాడులను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ వంటి అగ్రరాజ్యాల నుంచి అత్యాధునిక ఎఫ్‌-15 యుద్ధ విమానాలు, పేట్రియాట్, థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలను సౌదీ భారీ ఖర్చుతో కొనుగోలు చేసింది. అయినప్పటికీ, ఇరాన్ మద్దతుతో హౌతీలు సౌదీ భూభాగంలోని కీలక మౌలిక సదుపాయాలైన విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు.

సౌదీ రక్షణ వ్యవస్థల ముందున్న అసలు సమస్యలేంటి?
సౌదీ అరేబియా సుమారు 22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దేశంలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు వంటి కీలక ప్రాంతాలన్నింటినీ ప్రతి నిమిషం ఒకేరీతిలో రక్షించడం అంత సులభం కాదు. యెమెన్‌లోని దుర్భేద్యమైన పర్వత ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న అనుభవం హౌతీలకు ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తూ వారు సౌదీ రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తున్నారు. హౌతీల వరుస దాడులను తిప్పికొట్టే క్రమంలో సౌదీ వద్ద ఉన్న ఖరీదైన క్షిపణి నిరోధక ఇంటర్‌సెప్టర్ల నిల్వలపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడే ప్రమాదం ఉంది.

ఆర్థికంగానూ తీవ్ర నష్టం
ఈ దాడులు కేవలం సైనికపరమైన సవాలుగానే కాకుండా, సౌదీ ఆర్థిక వ్యవస్థను కూడా కలవరపెడుతున్నాయి. రియాద్‌ను గ్లోబల్ టూరిజం, బిజినెస్ హబ్‌గా మార్చాలన్న సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘విజన్ 2030’ లక్ష్యాలకు ఈ దాడులు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కీలక మౌలిక వసతులపై దాడుల కారణంగా విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే యెమెన్ యుద్ధం నుంచి పూర్తిగా బయటపడాలని భావిస్తున్న సౌదీకి, హౌతీల ఈ నిరంతర దాడులు కొత్త తలనొప్పిగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement