కరోనాకు హాట్‌బెడ్‌గా మారిన హాలండ్‌

Holland Become a Hotbed of Corona Virus - Sakshi

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో! ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా రక్షించుకోవడానికి ప్రపంచ ప్రజలంతా ముఖాన మాస్కులు ధరించి తిరుగుతుంటే నెదర్లాండ్స్‌ ప్రజల్లో ఎక్కువ మంది ఎలాంటి మాస్కులు ధరించకుండానే సాధారణ రోజుల్లాగే తిరిగారు. ఫలితంగా అతి తక్కువగా ఉన్న కరోనా కేసులు అతి ఎక్కువగా పెరిగిపోయాయి. వైరస్‌కు హాట్‌బెడ్‌గా మారిపోవడంతో హాలండ్‌ (నెదర్లాండ్స్‌) కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతున్న టాప్‌ దేశాల్లో ఒకటిగా చేరింది. 

దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ అత్యవసర చట్టం తీసుకరావడం కోసం అక్కడి ప్రభుత్వం డచ్‌ పార్లమెంట్‌లో బుధవారం ఓ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చేపట్టింది. ప్రతి లక్ష మందిలో 160 మందికి వైరస్‌ సోకుతోందని, ప్రతి రోజుకు ఐదువేల మంది వైరస్‌ బారిన పడుతున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని ప్రపంచ బ్యాంకు చేసిన సూచనలను పెడ  చెవిన పెట్టిన హాలండ్‌ ప్రధాన మంత్రి మార్క్‌ రుట్టే మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతూ వస్తున్నారు. ప్రజలు బలవంతంగా మాస్కులు ధరించేలా చేయలేనంటూ వచ్చారు. ఇప్పుడేమో బిల్లు పాస్‌ కాగానే మాస్క్‌లను తప్పనసరి చేస్తూ చట్టం తీసుకొద్దామని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించడం లేదని, దేశంలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువే ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top