చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు.
కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాముల ఓరియన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. దీంతో పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. అయితే.. క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి గంటకు 24,000 మైళ్ల వేగంతో ప్రవేశించినప్పుడు విపరీతమైన వేడిని, దాని హీట్ షీల్డ్ సమర్థవంతంగా తట్టుకుంది. మేం నలుగురం సేఫ్ అని ఆర్టెమిస్-2 కమాండర్ వైజ్‌మ్యాన్ ప్రకటించడంతో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
🚨 NASA's Artemis 2 crew capsule has successfully landed back on Earth pic.twitter.com/QJGe93a8UN
— Latest in space (@latestinspace) April 11, 2026
వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించాక.. హ్యుస్టన్‌కు తరలించనున్నారు. అక్కడ కొన్నిరోజులు వాళ్లను పరిశీలనలో ఉంచుతారు. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. అంతేకాదు.. 21వ శతాబ్దంలో (అపోలో17 మిషన్.. 1972 తర్వాత) చంద్రుడిపైకి జరిపిన తొలి మానవ సహిత యాత్ర ఇదే.
నాసా (NASA) చేపట్టిన ఆర్టెమిస్ 2 (Artemis II) మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించారు. కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుడి ఫార్ సైడ్ (అవతలి వైపు) ను దగ్గరగా పరిశీలించడమే కాకుండా, చంద్రుడిపై సూర్యగ్రహణాన్ని కూడా గమనించారు.
సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిని లక్ష్యంగా చేసుకుని నాసా జరిపిన ఈ యాత్రలో.. అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరాన్ని చేరుకుని కొత్త రికార్డు సృష్టించారు.
నెక్ట్స్ టార్గెట్ అదే..
ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఆర్టెమిస్ 3 (Artemis III) మిషన్‌కు ప్రయత్నాలు త్వరలోనే మొదలుపెట్టనుంది నాసా. తదుపరి ప్రయోగాల్లో మానవులను చంద్రుడిపై దించేందుకు, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించబోతున్నారు.



