
నలుగురు భారతీయులు దుర్మరణం
లండన్: దక్షిణ ఇటలీలోని మాటేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ పౌరులు మరణించినట్లు రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మాటేరా నగరంలోని స్కన్‌జానో జోనికో మున్సిపాలిటీ పరిధిలో, అగ్రి వ్యాలీ వద్ద శనివారం ఒక ట్రక్కును ఏడు సీట్ల రెనాల్ట్ సీనిక్ వాహనం ఢీకొంది. ఈ వాహనంలో నలుగురు భారతీయులు సహా మరో ఆరుగురు ఉన్నట్లు ఇటాలియన్ వార్తా సంస్థ ఏఎన్‌ఎస్‌ఏ ఆదివారం తెలిపింది. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జిత్ (33), సింగ్ హరి్వందర్ (31), సింగ్ జస్కరాన్ (20)గా గుర్తించారు.
దక్షిణ ఇటలీలోని మాటేరాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ పౌరులు మరణించడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మేము వివరాల కోసం స్థానిక ఇటాలియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. సంబంధిత కుటుంబాలకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుంది’.. అని పేర్కొంది. గాయపడిన ఐదుగురిని పోలికోరో ఆసుపత్రికి, అత్యంత తీవ్రంగా గాయపడిన ఆరో వ్యక్తిని.. పొటెన్జాలోని శాన్‌కార్లో ఆసుపత్రికి తరలించినట్లు ఇటాలియన్ వార్తా సంస్థ ఏఎన్‌ఎస్‌ఏ తెలిపింది. ట్రక్కు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై మాటేరా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు చేస్తోంది.