
టెల్ అవీవ్: గాజాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్‌కు అరబ్ దేశాల నుంచి గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండను అరబ్ దేశాలు ఖండిస్తూ, ఒక ప్రకటన విడుదల చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వైదొలగాలని హెచ్చరించాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనను స్వాగతించింది. దీనిని చారిత్రాత్మక ఘటనగా పేర్కొంది.
సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్‌తో సహా పలు అరబ్, ముస్లిం దేశాలు తాజాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఖండించాయి. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్ సమూహం దాని పాలనను ముగించాలని కోరాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్) సమావేశంలో అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), 17 ఇతర దేశాలు ఒక ప్రకటన చేశాయి. హమాస్ తన చెరలో ఉంచిన బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో అరబ్ దేశాలు,ముస్లిం దేశాలు సంయుక్తంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా శరణార్థుల కోసం పాటుపడుతున్న యూఎన్ ఏజెన్సీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయెల్ నేతలను కోరాయి. గాజాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విదేశీ దళాలను మోహరించాలని అరబ్ నేతలు కోరారు. గాజాలో తలెత్తుతున్న ఆకలి చావులను ఖండిస్తున్నామని అరబ్ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే అరబ్ ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నదన్నారు. కాగా గాజాలో ఘర్షణలు ప్రారంభమై 21 నెలలు గడిచింది. ఈ ఘర్షణల్లో 1,200 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ యుద్ధం గాజాలోని లక్షలాదిమందిని నిర్వాసితులను చేసిందని, ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభానికి కారణంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.