ఫేస్‌బుక్‌ వాడితే ఫోన్‌ నంబర్‌ అమ్ముకున్నట్లే! 

Facebook Users Phone Numbers Sale Through Telegram Bot - Sakshi

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది. ఫేస్‌బుక్‌ వాడకందారుల ఫోన్‌ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్‌బుక్‌ ఐడీలకు చెందిన ఫోన్‌ నంబర్లను టెలిగ్రామ్‌ ఆటోమేటెడ్‌ బోట్‌ను వినియోగించి ఒక సైబర్‌ క్రిమినల్‌ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఇలా బయటపడి ఉంటాయని పేర్కొంది. ఈ డేటాబేస్‌లో 2019 వరకు వివరాలున్నాయని తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ రిసెర్చర్‌ అలాన్‌ గాల్‌ ఒక ట్వీట్‌లో వివరాలు వెల్లడించారు. చదవండి: (బైడెన్‌ వలస చట్టంపై హోరాహోరీ)

2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్‌ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌ షాట్లను కూడా ఆయన షేర్‌ చేశారు. ఈ బోట్‌ 2021 జనవరి వరకు యాక్టివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే అంశాన్ని మదర్‌బోర్డ్‌ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్‌ బోట్‌ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్‌ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్‌బుక్‌ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది. అప్పుడే యూజర్లు హ్యాకింగ్‌ తదితర ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపింది.    చదవండి: (వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువుల సందడి!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top