ఐరోపా సమాఖ్య ఆకస్మిక నిర్ణయం
ట్రంప్ 10% సుంకంపై ఈయూ పార్లమెంట్ కన్నెర్ర
స్ట్రాస్‌బర్గ్/అసన్షియన్: గ్రీన్‌లాండ్ విషయంలో తన వెంట నిలబడని 8 ఐరోపా దేశాలపై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలు విధించడాన్ని యురోపియన్ యూనియన్ సమాఖ్య తీవ్రంగా తప్పుబట్టింది. ట్రంప్‌కు బుద్ధిచెప్పేలా అమెరికాతో గత ఏడాది జూలైలో కుదుర్చుకున్న చరిత్రాత్మక యురోపియన్ యూనియన్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనబెడుతున్నట్లు ఈయూ పార్లమెంట్ ఆదివారం ప్రకటించింది. దీంతో ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
పారదర్శకత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా జరిగిన ఈయూ–యూఎస్ డీల్‌ను తక్షణం స్తంభింపజేస్తున్నామని యురోపియన్ యూనియన్ పార్లమెంట్ స్పష్టంచేసింది. ‘‘ఐరోపా దేశాల వాణిజ్య ప్రయోజనాలకు భంగం కల్గించే ఎలాంటి చర్యలకైనా మేం దీటుగా ప్రతిచర్యలు, నిర్ణయాలు తీసుకుంటాం. ఇందులో అమెరికాకు ఎలాంటి మినహాయింపులు లేవు’’అని ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నామని, జూలై ఒకటోతేదీలోపు గ్రీన్‌లాండ్ కొనుగోలు ఒప్పందం పూర్తికాకపోతే మరో 25 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించడం తెల్సిందే.
దీనిపై యురోపియన్ పార్లమెంట్‌లోని పలు రాజకీయ పారీ్టలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘‘గ్రీన్‌లాండ్ విషయంల మనల్ని బెదిరిస్తున్న ట్రంప్ అనుకూలంగా ఈయూ–యూఎస్ డీల్‌ను ముందుకు తీసుకెళ్లకూడదు. అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌ల బుజ్జగింపులకు మనం చరమగీతం పాడదాం’’అని యురోపియన్ పీపుల్స్ పార్టీ చీఫ్ మ్యాన్‌ఫ్రెడ్ వెబర్ అన్నారు. ‘‘ఈయూ–యూఎస్ డీల్‌కు ఈయూ పార్లమెంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదముద్ర వేయొద్దు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను స్వీడన్‌లాంటి దేశాలు తమ ప్రతీకార చర్యలతో అడ్డుకోవాల్సిందే’’అని ఈయూ పార్లమెంట్ సభ్యురాలు, స్వీడన్ రాజకీయ నాయకురాలు కరీన్ కార్ల్స్‌బ్రో అన్నారు.
దక్షిణ అమెరికా దేశాలతో డీల్..
ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికాతో డీల్‌ను స్తంభింపజేసిన ఐరోపా సమాఖ్య వెనువెంటనే దక్షిణ అమెరికాలోని మెర్కొసర్ కూటమి దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పశి్చమాసియాలో యుద్ధాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో రక్షణాత్మకధోరణి పెరుగుతున్న వేళ దక్షిణఅమెరికా దేశాలతో ఈయూ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం గమనార్హం. దాదాపు పాతికేళ్లుగా హింసాత్మక ఘటనల నడుమే చర్చలు కొనసాగిన ఎట్టకేలకు స్వేచ్ఛా వాణిజ్యం కుదిరింది. పరాగ్వే దేశ రాజధాని అసన్షియన్ ఇందుకు వేదికైంది.
అమెరికా నుంచి అధిక టారిఫ్‌ల బెడద, చైనా నుంచి చౌక ఉత్పత్తుల వరదల నడుమ మెర్కొసర్ కూటమితో ఈయూ ఒప్పందం చేసుకుంది. మెర్కొసర్ కూటమిలో అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వేలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బొలివియా కొత్తగా చేరినప్పటికీ వాణిజ్య ఒప్పందంలో పాలుపంచుకోవట్లేదు. వెనెజువెలాను గతంలో కూటమి నుంచి బహిష్కరించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అర్జెంటీనా గొడ్డు మాంసం మొదలు జర్మనీ కార్ల దాకా పలు రకాల వస్తూత్పత్తులపై 90 శాతం టారిఫ్‌లను దశలవారీగా తొలగించనున్నారు. దీంతో ఈ వాణిజ్య ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య జోన్‌లలో ఒకటిగా మారనుంది. 70 కోట్ల మంది వినియోగదారులు ఈ డీల్‌తో లాభపడనున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమైనదని యురోపియన్ కమిషన్ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లూలా డసిల్వా అన్నారు.


