ప్రపంచ దేశాలకు ట్రంప్ ఆఫర్
వాషింగ్టన్: గాజా పునర్నిర్మాణ క్రతువు కోసం కొలువుదీరే ‘శాంతి మండలి’లో శాశ్వత సభ్యత్వం కోసం ఒక్కో దేశం 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,071 కోట్లు) చెల్లించాలట! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ మేరకు ప్రకటించారు!! ఈ మండలికి ఆయనే సారథ్యం వహిస్తుండటం తెలిసిందే.
గాజా పునర్నిర్మాణం కోసమే శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్) అని తొలుత చెప్పినా నిజానికి దీన్ని ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రతిపాదిత మండలికి సంబంధించిన ముసాయిదా చార్టర్‌లోని వివరాలను అంతర్జాతీయ మీడియా సంపాదించింది. అందులోని అంశాలతో కథనాలు వెలువడ్డాయి. ఐరాస, దాని అనుబంధ శాఖలు, సంస్థలు, కమిషన్లు, సలహా మండళ్లలో ఇతర దేశాల ఆధిపత్యం కొనసాగుతుండటంతో విసిగిపోయిన ట్రంప్ తన కనుసన్నల్లో పనిచేసే శక్తిమంతమైన అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపి ఆ మేరకే కొత్తగా ఈ శాంతిమండలిని తెరమీదకు తెచ్చారు.
తనకు నచ్చిన దేశాలకు ఇష్టానుసారం సభ్యత్వం ఇస్తున్నారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ‘‘దేశాలకు మూడేళ్ల వరకు శాంతి మండలి సభ్యత్వం ఉచితం. ఆ తర్వాత శాశ్వత సభ్యత్వం కోసం కనీసం 100 కోట్ల డాలర్లు చెల్లించాల్సిందే. అది కూడా నగదు రూపంలో. ఐదేళ్ల గడువులో పూర్తి మొత్తాలను చెల్లించాలి.
శాశ్వత సభ్యత్వం ఎవరికివ్వాలనే విషయంలో తుది నిర్ణయం ట్రంప్‌దే. శాంతి మండలిలో తీసుకునే నిర్ణయాలపై ప్రతి దేశం ఓటు హక్కు కల్గిఉంటుంది. కానీ ఆ ఓటు చెల్లుబాటయ్యేదీ లేనిదీ ట్రంప్ నిర్ణయిస్తారు. మండలి ఆర్థిక వ్యవహారాలు చైర్మన్ ఆదేశాల మేరకు జరుగుతాయి. సభ్యులను తొలగించే అధికారమూ పరోక్షంగా ఆయనదే’’ అని చెప్పారు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉండాలంటూ భారత్‌కు ట్రంప్ స్వయంగా ఆహ్వానం పంపారు.


