
నెతన్యాహూతో ఏకీభవించను: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు.
గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గాజాలో 17 టన్నుల ఆహారం జారవేత
యూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
పుతిన్‌కు గడువు 10, 12 రోజులే
ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలే
ట్రంప్ తాజా హెచ్చరిక
ఉక్రెయన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్‌లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్‌కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్‌ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్‌తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు.