ఆన్‌లైన్‌ ఎంచుకుంటే అమెరికా రావద్దు

Donald Trump says no new foreign students for all-online classes - Sakshi

ట్రంప్‌ సర్కార్‌ కొత్త నిబంధన

కొత్త విద్యార్థులకు కష్టాలు

వాషింగ్టన్‌: వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునే కొత్త విద్యార్థులెవరినీ దేశంలోకి రానివ్వకూడదని ఆయన నిర్ణయించారు. ఈ సెప్టెంబర్‌ నుంచి మొదలయ్యే సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి కటాఫ్‌ తేదీని మార్చి 9గా నిర్ణయించింది.

ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్‌లైన్‌ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది. కొత్తగా జాయిన్‌ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్‌ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్‌ సెక్యూరిటీలోని స్టూడెంట్స్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్‌ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది.

కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్‌లైన్‌ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ట్రంప్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్‌ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

డీఏసీఏ దరఖాస్తులూ పెండింగ్‌లో
చిన్నతనంలో అమెరికాకి వచ్చి, యుక్త వయసు వచ్చాక ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) దరఖాస్తులని సర్కార్‌ పెండింగ్‌లో ఉంచింది. గత నెలలో సుప్రీం కోర్టు డీఏసీఏని ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించినప్పటికీ సర్కార్‌ పెడచెవిన పెట్టింది. మేరీల్యాండ్‌లో అమెరికా జిల్లా కోర్టు డీఏసీఏని తిరిగి పాత పద్ధతిలోకి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.  

వర్క్‌ పర్మిట్లలోనూ జాప్యం
అమెరికాలో హెచ్‌4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్‌ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన మహిళ రంజిత సుబ్రహ్మణ్యం ఓహియో ఫెడరల్‌ కోర్టుకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న తనకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అం దకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్‌ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పం పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top