వాషింగ్టన్ డీసీ: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై డెన్మార్క్‌తో సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు నీళ్లు చల్లాయి. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. ట్రేడ్ బజూకా పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో ఆ హెచ్చరికలపై ట్రంప్ పరోక్షంగా స్పందించారు. డెన్మార్క్‌పై ఆగ్రహ వ్యక్తం చేశారు.
‘రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు ముప్పు ఉంది. దాన్ని నుంచి బయటపడేందుకు డెన్మార్క్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతోంది. అందుకే గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుని, దానిపై రష్యా ముప్పును తొలగిస్తామని ప్రకటించారు. అమెరికా తన మిత్రదేశాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గ్రీన్‌లాండ్ భౌగోళికంగా ఆర్కిటిక్ సముద్ర మార్గాలకు కీలకమైన ప్రాంతం. అమెరికా దీన్ని తన రక్షణ వ్యవస్థలో భాగంగా చూస్తోంది. థూల్ ఎయిర్‌బేస్ అమెరికా సైనిక వ్యూహంలో ప్రధాన కేంద్రంగా ఉంది. అదే సమయంలో ఆర్కిటిక్‌లో రష్యా సైనిక స్థావరాలు పెంచడం వల్ల అమెరికా, నాటో మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గ్రీన్‌లాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం. అమెరికా, డెన్మార్క్‌తో కలిసి రక్షణ చర్యలు చేపడుతోంది. డెన్మార్క్ ప్రభుత్వం కూడా ఆర్కిటిక్‌లో రష్యా ఉనికిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా–రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. రష్యా కొత్త సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుండగా, అమెరికా దీనిని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది.


