అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
ట్రంప్ ప్రకటనను ధ్రువీకరించని ఇరాన్
వచ్చే వారం రెండో దఫా శాంతి చర్చలకు ఛాన్స్
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది.
ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్‌గానీ ఇటు ఇరాన్‌గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది.
ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్‌లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు.
నేరుగా చర్చలొద్దు: హెజ్‌భొల్లా
ఇజ్రాయెల్‌తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్‌భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్‌భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్‌పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్‌భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు.
ఒప్పందానికి తూట్లు!
ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్‌పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్‌భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్‌పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ శుక్రవారం సూచించారు.
తిరిగొస్తున్న స్థానికులు..
లెబనాన్‌లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్‌మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్‌కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్‌కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది.


