ట్రంప్‌ భారీ విజయం.. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు సభ ఆమోదం | Donald Trump Big Victory One Big Beautiful Bill Clears Congress | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ భారీ విజయం.. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు సభ ఆమోదం

Jul 4 2025 7:08 AM | Updated on Jul 4 2025 11:35 AM

Donald Trump Big Victory One Big Beautiful Bill Clears Congress

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కల సాకారమైంది. ట్రంప్‌ కలల బిల్లు అయిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్‌ విజయం సాధించారు.

అమెరికా ప్రతినిధుల సభ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్‌.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్‌ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్‌ తీసుకొచ్చారు. 

ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్‌లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.

ట్రంప్‌ ఆనందం.. 
ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.

బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..
2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్‌టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.

వలస నియంత్రణపై ఫోకస్‌...
ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.

ఆరోగ్య పథకంలో భారీ కోతలు
తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement