
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్‌స్కీ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని జెలెన్‌స్కీకి ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఇక, శాంతి ఒప్పందానికి పుతిన్.. ట్విస్ట్ ఇస్తూ కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.
డోన్బాస్ ఇచ్చేయండి..
డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్‌స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్‌ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చ అనేది జెలెన్‌స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.
మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్‌స్కీకి వైట్‌హౌస్‌లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో ఈసారి జెలెన్‌స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు పాల్గొంటారు. ఇక, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.