
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతుందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు(25 శాతం పెనాల్టీతో కలిపి) విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతూ.. అదే పని చేస్తున్న చైనా, ఈయూల విషయంలో మినహాయింపు దేనికని అమెరికాను నిలదీసింది. దీనికి తోడు చైనా విషయంలో ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే..
అమెరికా చైనాను ఎందుకు మినహాయించింది? ఇండియాపై భారీ టారిఫ్‌లు ఎందుకు? అనే ప్రశ్నలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు జరిపే దేశాలే. ఆ రెండు మాస్కోకు ప్రధాన భాగస్వాములే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, భారత్‌తో పోలిస్తే చైనా పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి..
.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభపడుతోంది. అదే రష్యా నుండి చమురు కొనుగొలు చేసి.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్‌కు చైనా విక్రయిస్తోంది. ఒకవేళ.. చైనా మీద మీద గనుక అదనపు సుంకాలు విధించాల్సి వస్తే ఆ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని రుబియో వ్యాఖ్యానించారు.

చైనాలో శుద్ధి అవుతున్న రష్యా చమురు గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్తోంది. ఒకవేళ చైనాపై అదనపు సుంకాలుగానీ, ఆంక్షలుగానీ విధించాల్సి వస్తే.. శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్‌కు అందదు. చమురు కొనుగోలు చేసే దేశాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సి ఉంటుంది. అంతెందుకు..
చైనా నుంచి శుద్ధి చేయబడిన చమురును యూరప్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో.. యూరప్ దేశాలు స్వయంగానూ చమురు, సహజ వాయువును రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకు ముందు.. చైనా, అమెరికాపై వంద శాతం సుంకాలు విధించాలనే సెనెట్ బిల్లు ప్రతిపాదనపై యూరోపియన్ దేశాలు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆ పని చేయడం లేదు అని అన్నారాయన.
మరి ఐరోపా దేశాలపై సుంకాలు?
మరి రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తారా? అనే ప్రశ్నకు రూబియో బదులిచ్చారు. యూరప్ నేరుగా ఆంక్షలు, సుంకాల విధింపు గురించి నా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కానీ, పరోక్షంగా విధించే అవకాశాలు మాత్రం లేకపోలేదని అన్నారాయన. ఈ విషయంలో యూరోపియన్ దేశాలతో టిట్ ఫర్ టాట్ తరహా వాదనలు (tit-for-tat) చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడంలో యూరోప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మాత్రం నమ్ముతున్నా అని రుబియో అభిప్రాయపడ్డారు.