
సిడోఆర్జో: ఇండోనేసియాలో స్కూలు భవనం కుప్పకూలిన ఘటనలో మరణాలు 40కి చేరాయి. జాడ తెలియకుండా పోయిన మరో 23 మంది విద్యార్థుల కోసం శిథిలాలను తొలగిస్తూ అన్వేషణ కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. తూర్పు జావాలోని సిడోఅర్జోలోని అల్ ఖొజినీ స్కూలు భవనం సెప్టెంబర్ 30వ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలడం తెల్సిందే. ఈ ఘటనలో ఒకే ఒక్కరు విద్యార్థి మాత్రమే ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.
స్కూలులో చదివే 12–19 ఏళ్ల విద్యార్థుల్లో 95 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు ఆదివారం వెల్లడించారు. స్కూలు భవనంపై మరో అంతస్తు నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై స్కూల్ కేర్ టేకర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ మత పెద్ద అబ్దుస్ సలామ్ ముజిబ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దుర్ఘటనపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.