ల్యాబ్‌ థియరీలో కొత్త కోణం.. ముందస్తుగానే చైనా వ్యాక్సిన్‌!?

Chinese Scientist Filed Patent For COVID Vaccine In February 2020 - Sakshi

 ప్రపంచానికి వైరస్‌ గురించి చెప్పిన ఐదువారాలకే పేటెంట్‌ కోసం చైనా శాస్త్రవేత్త దరఖాస్తు 

బీజింగ్‌/ సిడ్నీ: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందన్న అనుమానాలు బలపడేలా రోజుకో కథనం బయటపడుతోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక ప్రచురించిన కథనం వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందన్న వాదనకు ఊతమిచ్చేలా ఉంది. ఆ కథనం ప్రకారం.. చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)లో పనిచేసిన శాస్త్రవేత్త యుసెన్‌ జువూ 2020 ఫిబ్రవరి 24న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కరోనాని గత ఏడాది మార్చి 11న మహమ్మారిగా ప్రకటించింది. అంతకుముందే కోవిడ్‌–19 వ్యాకిన్‌పై పేటెంట్‌ కావాలంటూ యుసెన్‌ పీఎల్‌ఏ తరఫున దరఖాస్తు చేయడం గమనార్హం.

కరోనా వైరస్‌ మనుషులకి సోకిందని చైనా ప్రకటించిన అయిదు వారాలకే వ్యాక్సిన్‌ పేటెంట్‌ గురించి యుసెన్‌ సన్నాహాలు చేయడాన్ని బట్టి వైరస్‌ గురించి చైనాకు అప్పటికే సంపూర్ణ అవగాహన ఉందనేది తేటతెల్లమవుతోంది. వూహాన్‌ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై పరిశోధనలు నిర్వహిస్తూ బ్యాట్‌ వుమెన్‌గా ప్రసిద్ధురాలైన ఆ ల్యాబ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ షి జెంగ్లీతో ఈయన కలిసి పని చేశారు. ముందస్తుగానే పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయడం, బ్యాట్‌ వుమెన్‌తో చాలా సన్నిహితంగా మెలగడం చూస్తుంటే డ్రాగన్‌ దేశం కరోనాపై ప్రపంచదేశాల కళ్లు కప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వూహాన్‌ ల్యాబ్‌లో పని చేసే ముగ్గురికి 2019 నవంబర్‌లోనే కరోనా లక్షణాలు కనిపించడం వంటి వార్తలు రావడంతో ల్యాబ్‌ థియరీపై ఆది నుంచి అనుమానాలే ఉన్నాయి.  

మూడునెలలకే అనుమానాస్పదంగా మృతి  
శాస్త్రవేత్త యుసెన్‌ జువూ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చైనాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన మరణ వార్త చైనాలోని కేవలం ఒక మీడియాలో మాత్రమే వచ్చిందని అమెరికాకు చెందని న్యూయార్క్‌ టైమ్‌ పత్రిక వెల్లడించింది. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, న్యూయార్క్‌ బ్లడ్‌ సెంటర్‌లో యుసెన్‌ శాస్త్రవేత్తగా పని చేశారని ఆ పత్రిక వివరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా కరోనా వైరస్‌ పుట్టుకపై నిజాలు నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్‌ను ఆదేశించడంతో దీనిపై సర్వత్రా మళ్లీ చర్చ మొదలైంది.

 చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ కావడంతో కోవిడ్‌–19 మహమ్మారి విజృంభించి ఉంటుందని ఏడాది క్రితమే అమెరికా నేషనల్‌ ల్యాబరెటరీ తన నివేదికలో పేర్కొన్నట్టుగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జే) వెల్లడించింది. అయితే దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని నేషనల్‌ ల్యాబరేటరీ భావించినట్టుగా  డబ్ల్యూఎస్‌జే తెలిసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడే కాలిఫోర్నియాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ నేషనల్‌ ల్యాబరెటరీ తన నివేదికని రూపొందించింది. కోవిడ్‌–19 వైరస్‌ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా  ఇది ల్యాబ్‌ నుంచి లీక్‌ అయి ఉంటుందని నిర్ణయానికి వచ్చి విదేశాంగ శాఖకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఇంటెలిజెన్స్‌ నివేదికను త్వరలోనే బైడెన్‌ విడుదల చేయనున్నారు. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top