
రోమ్: కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న 2020లో చైనా నిఘా సంస్థ తరపున అమెరికాకు సంబంధించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రహస్యాలను దొంగిలించిన హ్యాకర్, చైనా పౌరుడు జు జెవే(33)ను ఇటాలియన్ అధికారులు అరెస్టు చేశారు. ఇతనిపై అమెరికా.. అంతర్జాతీయ వారెంట్ జారీ చేసిన దరిమిలా, మిలన్‌లోని మాల్పెన్సా విమానాశ్రయంలో అతనిని అరెస్టు చేసినట్లు ఇటాలియన్ అధికారులు మీడియాకు తెలిపారు.
కోవిడ్-19 వ్యాక్సిన్‌లు, చికిత్స, పరీక్షలపై పరిశోధనలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, రోగనిరోధక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులను లక్ష్యంగా చేసుకుని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జెవే పనిచేశారని అమెరికా ఆరోపిస్తోంది. చైనాలో తలదాచుకుంటున్న జాంగ్ యు అనే మరో హ్యాకర్ కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. హ్యాకింగ్‌కు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న జెవేను అమెరికా న్యాయ శాఖ మిలాన్ కోర్టులో హాజరుపరిచింది.
వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం, జెవే కేసు గురించి తమకు తెలియదని, అయితే గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, దీనిపై చైనా ఇప్పటికే ఈ తన వైఖరిని ప్రకటించిందని పేర్కొంది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధికి ప్రపంచంలోనే చైనా పేరొందింది. దొంగతనంగా వ్యాక్సిన్‌ల డేటాను పొందే అవసరం చైనాకు లేదని చైనా ఎంబసీ ప్రతినిధి లియు పెంగ్యు ఒక ప్రకటనలో తెలిపారు.