China: అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..

China Overtakes US As Worlds Richest Nation As Global Wealth Surges - Sakshi

బీజింగ్‌: ప్రపంచలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్‌ సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్‌ వన్‌గా డ్రాగన్‌ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్‌బెర్గ్‌లోని నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, మెక్సికో, స్వీడ‌న్‌లు ఉన్నాయి. 

మెకిన్సే ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం ప్రపంచ వ్యాప్తంగా సంపద 2000లో 156 ట్రిలియన్‌ డాలర్లు ఉండగా ఇది 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది. దీనిలో చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని తెలిపింది. కాగా గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఇప్పుడు మ‌నం సంప‌న్నుల‌మ‌య్యామ‌ని జూరిచ్‌లోని మెక‌న్సీ గ్లోబ‌ల్ ఇన్స్‌టిట్యూట్ భాగ‌స్వామి జాన్ మిచ్‌కి తెలిపారు. 2000 సంవ‌త్స‌రంలో 7 ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న చైనా సంప‌ద ఇప్పుడు 120 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు వెల్లడించారు. ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో చైనా చేరిన త‌ర్వాత ఆ దేశ సంప‌ద దూసుకెళ్తున్న‌ట్లు మెక‌న్సీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. 

మ‌రోవైపు అమెరికా సంప‌ద రెండితలు పెరిగి 90 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంది. చైనా, అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలు. అయితే ఈ రెండు దేశాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే ఉందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం వారు మాత్రమే మరింత ధనవంతులు అవుతున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 68 శాతం నిక‌ర సంప‌ద మొత్తం రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనే ఉందని నివేదిక తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top