ఈమె 8 మంది శిశువులను చంపారట!

Children Nurse Charged With Murders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమె ఎప్పుడూ ముఖంపై చెరగని చిరు నవ్వుతో నిజమైన మాతమూర్తిలా కనిపిస్తుంది. ఆమె ఆ ఆస్పత్రిలో శిశువుల బాగోగులు చూసుకుంటుంటే దివి నుంచి దిగిన దేవ కన్యలా కనిపిస్తుంది. ఆమెలో అభం శుభం తెలియని శిశువులను నిర్ధాక్షిణ్యంగా చంపేసే రాక్షసి దాగుందంటే ఎవరూ నమ్మరు. ఆమె పేరే లూసీ లెట్‌బై. ఆమెకు 30 ఏళ్లు. ఇంగ్లండ్‌లోని చెస్టర్‌ యూనివర్శిటీ గ్రాడ్యువేట్‌. ఎన్‌హెఎస్‌ ఆధ్వర్యంలో చెస్టర్‌ నగరంలో నడుస్తున్న ‘కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆస్పత్రిలో శిశువుల సంరక్షణ బాధ్యతలను చూసుకునే నర్సుగా ఎప్పటి నుంచో పని చేస్తున్నారు.

2015, మార్చి నెల నుంచి 2016 జూలై నెల మధ్య ఆ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న శిశువుల మరణాలు హఠాత్తుగా పెరిగాయి. ప్రసవం సందర్భంగా, నెలలు నిండకుండానే సాధారణంగా సంభవించే శిశు మరణాలకంటే ఆ ఏడాది కాలంలో ఆ మరణాలు 10,11 శాతం పెరిగాయి. ఆస్పత్రి ఉన్నతాధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేయగా, అనుమానాలన్నీ లూసీ లెట్‌బై వైపే దారితీశాయి. అంతకుముందు లివర్‌పూల్‌ ఆస్పత్రిలో పని చేయడమే కాకుండా, వైద్య సేవల కోసం మూడు మిలియన్‌ పౌండ్లు (దాదాపు 29.5 కోట్ల రూపాయలు) విరాళాలుగా వసూలు చేసిన ఘన చరిత్ర ఆమెకుంది. తోటి నర్సులు కూడా లూసీ అలాంటి నేరాలకు పాల్పడుతుందని కలలో కూడా ఊహించలేదు.

చెస్టర్‌ ఆస్పత్రిలో అసహజంగా కనిపించిన శిశు మరణాలలో, వారి వద్దకు ఆఖరి సారి వెళ్లిందీ లూసీయేనని తేలడంతో ఆస్పత్రి అధికార వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆస్పత్రిలో అంతుచిక్కని శిశు మరణాలపై దర్యాప్తు జరిపిన చెషైర్‌ పోలీసులు 2018లో ఒకసారి, 2019లో ఒకసారి లూసీని అరెస్ట్‌ చేశారు. ఆమెపై ఎనిమిది మంది శిశువుల హత్య, ఆరుగురు శిశువులపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. అదే కేసులో తాజాగా ఆమెను మూడోసారి మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. లూసీపై కొత్తగా మరో నాలుగు హత్యాయత్నం కేసులు అదనంగా నమోదు చేశారు. మొత్తం ఆమెపై దాఖలైన కేసులు ఎనిమిది హత్య కేసులుకాగా, పది హత్యాయత్నం కేసులు.

ఇంతకుముందు రెండుసార్లు లూసీని చెస్టర్‌ ఆస్పత్రిలోనే అరెస్ట్‌ చేయగా, ఈసారి ఆమె నివసిస్తున్న వెస్ట్‌బోర్న్‌ రోడ్డులోని ఆమె ఇంటిలో అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు ఇంకా ముగియనందున మొదట రెండుసార్లు లూసీ బెయిల్‌పై విడుదలయ్యారు. అత్యంత సంక్లిష్టమైన, సున్నితమైన ఈ కేసును గత మూడేళ్లుగా దర్యాప్తు చేస్తున్నామని డిటెక్టివ్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫాల్‌ హగెస్‌ తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల ఆ శిశువులు గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో చనిపోయారని లూసీ చెబుతూ వస్తున్నారు.

ఆయన చనిపోయిన శిశువుల కాళ్లు, చేతులపై ఒక విధమైన గాయాలుండడం అటు ఆస్పత్రి వర్గాలను, ఇటు పోలీసులను ఆశ్యర్య పరుస్తోంది. లూసీ ఇలాంటి నేరాలు చేశారంటే తాము ఇప్పటికీ నమ్మలేక పోతున్నామని, ఆమె తనకెంతో ఇష్టమని నర్సు వత్తిలో ఇప్పటికీ కొనసాగుతున్నారని మిత్రులు తెలిపారు. అభియోగాలు ఎదుర్కొంటున్న లూసీ మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు మొదటి నుంచి నిరాకరిస్తూ వస్తున్నారు. ఇంగ్లండ్‌ స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు లూసీని అక్కడి కోర్టు ముందు హాజరపర్చాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top