బడులు తెరిస్తే ఎట్లా...?

Boris Johnson Urges Parents to Send Children Back to School - Sakshi

లండన్‌ : బ్రిటన్‌లోని అన్ని పాఠశాలలను వచ్చే వారం నుంచి తెరవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలకు తమ పిల్లలను పంపించే విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. భయపడి పిల్లలను బడులకు పంపించనట్లయితే వారి భవిష్యత్తును దెబ్బతీసిన వారవుతారని తల్లిదండ్రులను ఆయన హెచ్చరించారు. (కరోనా నివారణలో ‘బీపీ మందులు’)

గత మార్చి నెలలో కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా మూత పడిన అనేక పాఠశాలల్లో కొన్ని గత జూన్‌ నెలలోనే తెరచుకోగా, పలు పాఠశాలలు ఇంకా తెరచుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్, వేల్స్, నార్త్‌ ఐర్లాండ్‌లో ఇంకా పలు పాఠాశాలలు తాళాలు వేసి ఉన్నాయి. వీటన్నింటిని వచ్చే సోమవారం నుంచి తెరవాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

పిల్లలను బడికి పంపినట్లయితే కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారి తల్లిదండ్రులు ఎక్కువగా భయపడుతున్నారు. బడి పిల్లల కన్నా బడి టీచర్లు, ఇతర సిబ్బంది వల్ల కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తోందని బ్రిటన్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్యామెజ్‌ జధాని తెలిపారు. ఆయన బ్రిటన్‌ ప్రభుత్వ వైద్యరంగంలో అంటురోగాల నిపుణుడిగా పని చేస్తున్నారు. జూన్‌ నుంచి ప్రారంభమైన పాఠశాలలల్లో 23 వేల మంది బడి పిల్లలకు ఒకరు చొప్పున కరోనా బారిన పడగా, బడి పంతుళ్లలో పది వేల మందికి ఒకరు చొప్పున కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 70 మంది పిల్లలు కరోనా బారిన పడగా, 128 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. తరగతి గదులకు వెలుపలు వారు సామాజిక దూరం పాటించక పోవడమే కరోనా వ్యాప్తికి కారణమని తేల్చారు.

పాఠశాలలు ప్రారంభించిన తర్వాత కరోనా విస్తరించినట్లయితే అప్పుడు అమలు చేసేందుకు ‘ప్లాన్‌ బీ’ సిద్ధంగా ఉండాలని, అలా అయితేనే తాము విధులకు హాజరవుతామని బ్రిటన్‌లో అత్యధిక టీచర్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న టీచర్ల సంఘం ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ యూనియన్‌’ షరతు విధించింది. (డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్‌ సిగ్నల్‌!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top