15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు! | Bolivia Ends 15-Year Dollar Peg: What It Means for Its Economy | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!

Jun 29 2026 12:14 PM | Updated on Jun 29 2026 12:26 PM

Bolivia Ends 15-Year Dollar Peg: What It Means for Its Economy

ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..

సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్‌కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్‌తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.

సడన్‌గా ఎందుకు?..
ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.

ఇకపై..
డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరికొన్ని దేశాలు..
బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్‌తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్‌కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.

అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.

ఒక దేశం తన కరెన్సీని డాలర్‌కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.

భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement