రెండు వారాల క్రితం నాటి వీడియో వైరల్‌

Bernie Sanders Uncannily Predicts Trump Every Move in Viral Video - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరపడింది. విజయ బావుటా ఎగరవేయటానికి జో బైడెన్‌ అత్యంత సమీపంలో ఉన్నారు. ఆరు ఎలక్టోరల్‌ ఓట్లు సొంతమైతే మ్యాజిక్‌ ఫిగర్‌ను ఆయన చేరుకుంటారు. అయితే జార్జియాలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి ట్రంప్‌ న్యాయపోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో డెమొక్రాటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్ రెండు వారాల క్రితం అమెరికా ఎన్నికల గురించి.. కౌంటింగ్‌ సమయంలో చోటు చేసుకునే ట్విస్ట్‌లు.. ట్రంప్‌ స్పందన గురించి తన అంచనాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు జరగిన సంఘటనలను ఓ సారి చూస్తే.. ఆయన మాట అక్షరం పొల్లు పోలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబర్‌లో జిమ్మీ ఫాలన్‌ టునైట్‌ షోలో భాగంగా 79 ఏళ్ల బెర్నీని ఇంటర్వ్యూ చేశారు. ఇక ఎన్నికల ఫలితాల గురించి బెర్నీ తన అంచనాలను ఈ షోలో వెల్లడించారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని.. ఫలితంగా కౌంటింగ్‌ ప్రక్రియ ముగియడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బెర్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.

ఇక బెర్నీ మాట్లాడుతూ.. ‘నా అంచనా ఏంటంటే పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌ వంటి రాష్ట్రాల్లో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ మొత్తంలో నమోదవుతాయి. ఫ్లోరిడా లేదా వెర్మోంట్ వంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా, వేరే ఇతర కారణాల వల్ల, ఎన్నికల రోజు వెంటనే  ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరు. అంటే ఈ ఏడాది ఎక్కువ రాష్ట్రాల్లో, మిలియన్ల కొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయి. అయితే డెమొక్రాట్లు ఎక్కువగా మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ని వినియోగించుకుంటారు. రిపబ్లికన్లు మాత్రం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారు. ఇక ఎన్నికలు జరిగే నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రంప్‌ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో విజయం సాధిస్తాడు. దాంతో వెంటనే టీవీల్లో కనిపించి ‘నన్ను మరో సారి ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు. ఇక అంతా ముగిసింది. ఇదొక మంచి రోజు’ అంటారు’ అని బెర్నీ తెలిపారు. (చదవండి: అక్కడ ట్రంప్‌కే అవకాశాలెక్కువ)

బెర్నీ చెప్పినట్లే నిన్న జరిగింది. అలానే ‘మరుసటి రోజు మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు జరుగుతుంది. ఇక ఆయా రాష్టాల్లో బైడెన్‌ విజయం సాధిస్తారు. అప్పుడు ట్రంప్‌ చూశారా మోసం చేశారు. మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ అంతా మోసం. నేను పదవికి రాజీనామా చేయను’ అంటారు అని బెర్నీ అంచనా వేశారు. ఇక వాస్తవంలో కూడా అదే జరిగింది. బైడెన్‌ మిచిగాన్‌, విస్కాన్సిన్‌లో విజయం సాధించారు. అధిక్యం దిశలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ తాను ఈ ఫలితాలను అంగీకరించనని.. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతడి మద్దతుదారులు పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జీయా ఫలితాల విషయంలో కోర్టుకు వెళ్తామని చెప్పగా..  విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: నమస్తే బైడెన్‌.. బై..బై ట్రంప్)

హన్నాహ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో దీన్ని 27 మిలియన్ల మంది చూశారు. ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మేజిక్‌​ ఫిగర్‌ (270)ను అందుకునేందకు చేరువలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top