లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్‌లో ప్రత్యక్షం

Bentley car stolen from London found in Karanchi Pakistan - Sakshi

లండన్‌: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్‌లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్‌ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ పాకిస్తాన్‌లో కనుగొంది.

బ్రిటన్‌ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంపన్నులుండే డీహెచ్‌ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్‌ రిజిస్ట్రేషన్, నంబర్‌ ప్లేట్‌తో యజమాని అది పాక్‌ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్‌ అధికారులు ఇచ్చిన ఛాసిస్‌ నంబర్‌ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్‌ చేశారు.

అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్‌ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్‌ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top