బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే | Sakshi
Sakshi News home page

బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే

Published Mon, Jan 8 2024 4:46 AM

Bangladesh PM Sheikh Hasina Secures 5th Term As Awami League Wins - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్‌ నెగ్గింది. ఆదివారం పోలింగ్‌ జరగ్గా రాత్రికల్లా తొలి దశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. దాంతో ప్రధానిగా షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు.

దాంతో కేవలం 40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్‌ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.

భారత్‌ పొరుగుదేశం కావడం అదృష్టం
ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పారీ్ట–జమాత్‌–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ప్రధాని షేక్‌ హసీనా విమర్శించారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని చెప్పారు. భారత్‌ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. భారత్‌ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్‌ ఎంతగానో సహకరించిందని చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement