పాక్‌ పక్కలో బల్లెం బలూచిస్తాన్‌  | Baloch Fighters Launch Devastating Attacks on Pakistani Forces | Sakshi
Sakshi News home page

పాక్‌ పక్కలో బల్లెం బలూచిస్తాన్‌ 

May 10 2025 5:41 AM | Updated on May 10 2025 5:41 AM

Baloch Fighters Launch Devastating Attacks on Pakistani Forces

సైన్యంపై విరుచుకుపడుతున్న బలూచ్‌ రెబల్స్‌  

తాజా దాడుల్లో 16 మంది పాకిస్తాన్‌ సైనికులు హతం  

గ్యాస్‌ పైపులైన్లు, ఇంధన నిల్వలు సైతం ధ్వంసం  

తిరుగుబాటుదార్ల అదీనంలోకి రాజధాని క్వెట్టా  

ఇస్లామాబాద్‌: భారత సైనికదళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు నైరుతి ప్రాంతంలో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలూచిస్తాన్‌ తిరుగుబాటుదార్లు అదనుచూసి మరీ పాక్‌ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సరైన సమయమన్న భావన వారిలో కనిపిస్తోంది. తూర్పున భారత్, పశ్చిమాన బలూచిస్తాన్‌ రెబల్స్‌ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. 

గురువారం రాత్రి భారత్‌పై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించడంలో తీరికలేకుండా ఉన్న పాకిస్తాన్‌ సైన్యం మరోవైపు నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడంలో విఫలమైంది. బలూచ్‌ ఫైటర్లు పాక్‌ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ దాడుల్లో ఏకంగా 16 మంది పాకిస్తాన్‌ సైనికులు మరణించినట్లు తెలిసింది. మరోవైపు బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో పలు కీలక ప్రాంతాలను రెబల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 

అక్కడ పాకిస్తాన్‌ జాతీయ జెండాలను తొలగించి, తమ జెండాలు ఎగురవేసి పాక్‌ సార్వభౌమత్వానికి సవాలు విసిరారు. బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టా సైతం తిరుగుబాటుదార్ల అ«దీనంలోకి వచ్చినట్లు సమాచారం. ‘‘పాకిస్తాన్‌కు వీడ్కో లు, కొత్త దేశం బలూచిస్తాన్‌కు స్వాగతం’’అంటూ స్థానిక రచయిత మీర్‌ యార్‌ బలూచ్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. కొత్తగా అవతరించిన బలూచిస్తాన్‌లో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.  

తిరుగుబాటు ఉధృతం  
స్వతంత్ర బలూచిస్తాన్‌ దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. పాకిస్తాన్‌ నుంచి విడిపోతామన్న డిమాండ్లు నానాటికీ బలం పుంజుకుంటున్నాయి. ప్రజా ఉద్యమాలను పాక్‌ సైన్యం కర్కశంగా అణచివేస్తోంది. ఇప్పటికే ఎన్నో తిరుగుబాటు గ్రూప్‌లు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోంది. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధం ప్రారంభం కావడం బలూచిస్తాన్‌ రెబల్స్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. గురువారం పలు తిరుగుబాటు గ్రూప్‌లు ఉమ్మడిగా పాక్‌ సైన్యంతో తలపడ్డాయి. సైన్యానికి సంబంధించిన ఆస్తులు, మౌలిక సదుపాయాలపైనా దాడులకు దిగాయి. రెబల్స్‌ శుక్రవారం క్వెట్టాలోని ఫైజాబాద్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యంపై దాడులకు పాల్పడ్డారు. సిబ్బీ మిలటరీ క్యాంపుపై హ్యాండ్‌ గ్రనేడ్‌ ప్రయోగించారు. బుధవారం బలూచిస్తాన్‌లో గ్యాస్‌ పైపులైన్లు, ఇంధన నిల్వలపై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలియజేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement