ఆశ్చర్యపోయే అంశం.. సూర్యుడు లేని గ్రహాలు!

Astronomers Find At Least 100 Free Floating Exoplanets in Nearby Star Forming Region - Sakshi

జూపిటర్‌ కన్నా పెద్దవి

నక్షత్రం లేకుండా మనుగడ

గ్రహం.. అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటి. కానీ, 2021 ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది. పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్‌ ప్లానెట్స్‌(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్‌ ప్లానెట్స్‌ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా.  బరువులో జూపిటర్‌కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు.
(చదవండి: వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్‌ దాడి)

జర్నల్‌ నేచర్‌ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేషించాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్‌ రొయిగ్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన.  
(చదవండి: అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో! ప్రాణాలు పోతున్నా జనాల్ని కాపాడుతున్నారు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top