
గాజాలో కాల్పుల విరమణతో పెరుగుతున్న ఆశలు
ఈజిప్టులో ట్రంప్ అధ్యక్షతన ‘శాంతి శిఖరాగ్రం’
కైరో: కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పాలస్తీనియన్లకు తక్షణ మానవతా సాయం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఒప్పందం ప్రకారం రోజుకు 600 ట్రక్కుల సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన పర్యవేక్షణాధికారి ఒకరు తెలిపారు. ఆదివారం తాము 400 ట్రక్కుల ఆహార పదార్థాలను పంపించనున్నట్లు ఈజిప్టు ప్రకటించింది.
కెరెమ్ షలోమ్ వద్ద ఇజ్రాయెల్ అధికారులు తనిఖీలు జరిపాక, ఇవి గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ మీదుగా గాజాలోకి పదుల సంఖ్యలో ట్రక్కులు ప్రవేశిస్తున్న ఫుటేజీ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రక్కుల్లో టెంట్లు, దుప్పట్లు, ఆహారం, ఇంధనం, వైద్య సాయం ఉన్నాయని ఈజిప్టు రెడ్ క్రీసెంట్ తెలిపింది.
నెలలపాటు కొనసాగిన ఇజ్రాయెల్ దిగ్బంధనం ఫలితంగా గాజాలో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. యుద్ధం సమయంలో అవసరమైన సాయంలో 20 శాతం మేర మాత్రమే సరఫరా చేయగలిగామని ఐరాస తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం, మందులు, ఇతర మానవీయ సాయం సిద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ ఓకే చెప్పిన వెంటనే గాజాలోకి వీటిని పంపుతామంది.
బందీలు, ఖైదీల విడుదలకు ఏర్పాట్లు
గాజాలో హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న వందలాది పాలస్తీనా ఖైదీల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి బందీల విడుదల మొదలవుతుందని ఈ వ్యవహారాలను పర్యవేక్షించే ఇజ్రాయెల్ అధికారి గాల్ హిర్‡్ష చెప్పారు. సజీవంగా ఉన్న వారి కోసం ఆస్పత్రులతోపాటు రెయిమ్ క్యాంపులో ఏర్పాట్లు చేశామన్నారు.
మృతదేహాలను తమకు అప్పగించిన వెంటనే గుర్తింపు కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలించనున్నట్లు చెప్పారు. హమాస్ చెరలో ఉన్న 48 మందిలో కనీసం 20 మంది సజీవంగా ఉండొచ్చని అంటున్నారు. ఇలా ఉండగా, తమ జైళ్ల నుంచి 2 వేల మంది పాలస్తీనా ఖైదీల విడుదల సమయాన్ని ఇజ్రాయెల్ ఇంకా ప్రకటించలేదు. వీరిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మందితోపాటు, యుద్ధ సమయంలో గాజా నుంచి ఎలాంటి కారణం చూపకుండా ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకెళ్లిన మరో 1,700 మంది ఉన్నారు.
నేడు ఇజ్రాయెల్‌కు ట్రంప్ రాక
బందీలను విడుదల చేయనుండటంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అన్నీ తానై వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ రానున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో జరిగే కార్యక్రమంలో బందీల కుటుంబాలతో ఆయన మాట్లాడుతారని వైట్‌హౌస్ తెలిపింది. అనంతరం ఈజిప్టు వెళతారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసితో కలిసి ప్రాంతీయ, అంతర్జాతీయ నేతలతో జరిగే శాంతి శిఖరాగ్రానికి సహాధ్యక్షత వహిస్తారు.