
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 78 కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు ఈ అభియోగాలు అన్నిటిలోనూ శిక్ష పడి, ఏకకాలంలో శిక్ష అనుభవించినా జీవితకాలం పాటు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 76కు చేరుకుంది. ఒకవేళ అభియోగాలన్నీ నిరూపణ అయ్యి ఆయన దోషిగా తేలితే మాత్రం ఆయా నేరాల శిక్షా సమయాన్ని బట్టి ట్రంప్ జీవితకాలం ఖైదును అనుభవించాల్సిందే.
శృంగార తారకు చెల్లింపుల వ్యవహారంతో మొదలైన కేసుల పరంపర వైట్ హౌస్ రహస్య పత్రాల కేసుతో ఆయన మెడకు ఉచ్చు మరింత బిగిసింది. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదై ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు వైట్ హౌస్ అధికారులు వాంగ్మూలం ఇవ్వడంతో ట్రంప్ ఇరుకున పడ్డారు.
అసలే వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి అభ్యర్థి రేసులో కూడా డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కేసుల ఊబి నుండి బయట బయట పడతారా? బయటపడినా వైట్ హౌస్ చేరుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..