లంక జైల్లో గ్యాంగ్‌ వార్‌ | 26 killed in Sri Lanka prison clash | Sakshi
Sakshi News home page

లంక జైల్లో గ్యాంగ్‌ వార్‌

Jul 7 2026 5:24 AM | Updated on Jul 7 2026 5:24 AM

26 killed in Sri Lanka prison clash

26 మంది మృతి!

మత్తుమందుల వ్యవహారమే కారణం? 

పోలీసుల తుపాకులు లాక్కొన్న ఖైదీలు

కొలంబో (శ్రీలంక): శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఆదివారం మొదలైన గ్యాంగ్‌ వార్‌ 26 మంది ప్రాణాలు తీసింది. వందమంది గాయపడ్డారు. మృతుల్లో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతోపాటు జైలు గార్డులు కూడా ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. నేరగాళ్ల గుంపులు మొదట ఆదివారం ఒకరితో ఒకరు తలపడటంతో ఈ గ్యాంగ్‌ వార్‌ మొదలైంది. అయితే సోమవారం వీరు జైల్లోని తుపాకులు కూడా లాక్కోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అచ్చం సినిమాల్లో చూపినట్టుగానే మత్తుమందుల రవాణాకు సంబంధించి రెండు వైరి గ్రూపుల మధ్య వివాదంతో ఘర్షణ మొదలైనట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. ఒక వర్గం మత్తుమందుల రవాణాకు పాల్పడతూండగా ఇంకో వర్గం దాన్ని వ్యతిరేకించింది.

ఒక వర్గం సమాచారం ప్రత్యర్థి వర్గానికి ఎవరు అందించారన్న విషయమై ఘర్షణ మొదలైనట్లు తెలిసింది. ఆదివారం రెండు వర్గాల వారు కలబడటంతో 20మంది వరకూ మరణించారు. ఆ తరువాత కొందరు మహిళ ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపై నిరసన ప్రదర్శన నిర్వహిస్తూండగా అది పాక్షికంగా కూలిపోయింది.  పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జైల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.

తొలి రోజు ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఖైదీలు జైలు ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులు స్వా«దీనం చేసుకున్నారు. కాల్పులు జరిపారు. ఫలితంగా నలుగురు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు నెగొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల్లో సుమారు వంద మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఖైదీలతో పాటు గార్డుల్లో చాలామంది తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డారని, పలువురు కత్తిగాటు గాయాలతో ఉన్నారని నెగెంబో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిలో కొందరిని కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement